-
జగిత్యాల పోలీస్‌స్టేషన్‌లో గోడు వెళ్లబోసుకున్న 12 ఏండ్ల బాలిక
-
సఖి సెంటర్‌కు తరలించిన ఆఫీసర్లు
జగిత్యాల, వెలుగు : ‘నాన్న కొడుతుండు.. ఆయన వద్ద ఉండలేను.. హాస్టల్‌లోనే ఉంటా’ అంటూ ఓ పన్నెండేళ్ల బాలిక సోమవారం జగిత్యాల పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లెకు చెందిన బాలిక తల్లి గతంలో చనిపోయింది. దీంతో తండ్రి రెండో పెండ్లి చేసుకున్నాడు. ఏడో తరగతి చదువుతున్న బాలికకు గతంలో బాల సదనం, ఆనంద నిలయంలో ఆశ్రయం కల్పించినా ఉండలేదు. ఆ తర్వాత సారంగపూర్ కేజీబీవీలో చేర్చినా అక్కడ కూడా ఉండలేక తిరిగి ఇంటికి చేరింది.
అయితే తండ్రి కొడుతుండడంతో ఐదు రోజుల కింద ఇంటి నుంచి వెళ్లిపోయింది. వేములవాడలో బాలికను గుర్తించిన పోలీసులు సిరిసిల్ల సఖి కేంద్రంలో చేర్చారు. అక్కడి నుంచి బాలికను జగిత్యాల సఖి సెంటర్‌కు తీసుకొచ్చిన ఆఫీసర్లు సోమవారం బాలిక తండ్రిని పిలిచి అప్పగించారు. అయితే సఖి కేంద్రం నుంచి బయటకు రాగానే బాలికను కొట్టడంతో చుట్టుపక్కల వారు గమనించి ఆపారు. వెంటనే బాలిక జగిత్యాల పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని నాన్న ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడని, హాస్టల్‌లో ఉండి చదువుకుంటానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో స్పందించిన టౌన్ సీఐ వేణు జగిత్యాల డీసీపీవో సిబ్బంది సమాచారం ఇచ్చారు. వారు వచ్చి బాలికను సఖీ సెంటర్‌కు తీసుకెళ్లారు.