- మంత్రి మల్లారెడ్డి పంపిన ల్యాప్‌టాప్ తనది కాదన్న ఐటీ ఆఫీసర్ రత్నాకర్
- ల్యాప్‌టాప్ సీజ్ చేసి..కోర్టులో డిపాజిట్ చేయనున్న బోయిన్‌పల్లి పోలీసులు
- ఆ ల్యాప్‌టాప్ ఓపెన్ చేస్తేనే వీడనున్న మిస్టరీ
హైదరాబాద్, వెలుగు: ఇన్‌కమ్ ట్యాక్స్ (ఐటీ) డిపార్ట్ మెంట్ డిప్యూటీ కమిషనర్ రత్నాకర్ ల్యాప్‌టాప్ మిస్సింగ్ మిస్టరీగా మారింది. రెండ్రోజులు గడుస్తున్నా ల్యాప్‌టాప్ జాడ దొరకలేదు. పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణలో మంగళవారం నుంచి బుధవారం రాత్రి వరకు మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు.
బుధవారం అర్ధరాత్రి మల్లారెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్న టైమ్ లో తన ల్యాప్‌టాప్ మాయం చేశారని ఐటీ అధికారి రత్నాకర్ బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు రాత్రి ల్యాప్‌టాప్‌ను తిరిగి ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డికి పోలీసులు సూచించగా.. ఆయన ఇంటికి వెళ్లి, తన అనుచరులతో ఓ ల్యాప్‌టాప్ పంపించారు. అయితే అది తనది కాదని రత్నాకర్ చెప్పారు. వేరే ల్యాప్‌టాప్ తెచ్చారని, తన ల్యాప్‌టాప్‌లో విలువైన సమాచారం ఉందని తెలిపారు.
మల్లారెడ్డి అనుచరులు తీసుకొచ్చిన ల్యాప్ టాప్ తీసుకునేందుకు నిరాకరించారు. తర్వాత మరో ఇద్దరు కార్యకర్తలు డెల్ ల్యాప్‌టాప్ తీసుకువచ్చారు. పోలీస్ స్టేషన్ లోపలికి అనుతించకపోవడంతో గేట్ వద్ద పెట్టి వెళ్లిపోయారు. అయితే అది కూడా తనది కాదని రత్నాకర్ తెలిపారు. దాన్ని కూడా తీసుకోలేదు. దీంతో ఆ ల్యాప్ టాప్ ను పోలీసులు తీసుకొని భద్రపరిచారు. శుక్రవారం కూడా ఐటీ అధికారులెవరూ ల్యాప్ టాప్ తీసుకోవడానికి రాలేదు.
దీంతో ఆ ల్యాప్‌టాప్‌ను పోలీసులు సీజ్ చేసి సీల్డ్ కవర్‌లో ప్యాక్ చేశారు. కేసు తీవ్రత నేపథ్యంలో దాన్ని ఓపెన్ చేయడం లేదు. మరో రెండ్రోజుల వరకు సంబంధిత వ్యక్తులు సంప్రదించకపోతే స్టేషన్ లాకర్‌లో లేదా గుర్తు తెలియని ప్రాపర్టీ కింద కోర్టులో డిపాజిట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఓపెన్ చేస్తేనే తెలుస్తది..
మల్లారెడ్డి పంపించిన ల్యాప్‌టాప్ ఎవరిది అనేది తేల్చడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఓపెన్ చేసి చెక్ చేస్తే సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ స్టేషన్ లో రిజిస్టర్ అయిన రెండు జీరో ఎఫ్‌ఐఆర్‌లను దుండిగల్ స్టేషన్ కు ట్రాన్స్‌ఫర్ చేశారు. ల్యాప్‌టాప్‌ను మాత్రం బోయిన్‌పల్లి స్టేషన్ లోనే భద్రపరిచారు. ఐటీ అధికారి రత్నాకర్ ఫిర్యాదు ఆధారంగా దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ల్యాప్‌టాప్‌ను ఆన్ చేసి చెక్ చేస్తే తప్ప మిస్టరీ వీడే పరిస్థితులు కనిపించడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. దీనికి కోర్టు అనుమతి తప్పనిసరి అని చెబుతున్నారు.
ఐటీ ఆఫీసర్ రత్నాకర్‌ను అరెస్టు చేయొద్దు: హైకోర్టు
ఐటీ ఆఫీసర్ రత్నాకర్ పై బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ముందుకు వెళ్లొద్దని, తదుపరి విచారణ వరకు రత్నాకర్‌ను అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ కె.సురేందర్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
ఐటీ ఆఫీసర్లు దాడి చేయడంతో తన సోదరుడు మహేందర్‌రెడ్డి ఆసుపత్రి పాలయ్యారని, తన దగ్గరి నుంచి బలవంతంగా సంతకాలు తీసుకున్నారని మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఐపీసీ 384 కింద కేసు నమోదైంది. దీన్ని కొట్టివేయాలంటూ రత్నాకర్ హైకోర్టులో శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. కేసు దర్యాప్తుపై స్టే విధించింది. నాలుగు వారాల వరకు రత్నాకర్‌ను అరెస్టు చేయొద్దని ఆదేశాలిస్తూ విచారణను వాయిదా వేసింది.