అనిల్ అంబానీ నిల్.?

వ్యాపారంలో అప్​ అండ్​ డౌన్స్​ సహజం. అన్మదమ్ములు వాటాలు పంచుకున్నాక ఒకడు పైకి ఎదగడం, రెండోవాడు దిగజారడంకూడా చాలా సందర్భాల్లో జరుగుతుంది. ఒకప్పుడు టాప్​–10లో ఉన్నవాడు సడెన్​గా నేలకు పడిపోయి… ‘జీరో’గా మిగలడం మాత్రం ఇటీవల జరగలేదు. ఇన్వెస్టర్ల నమ్మకం కూడగట్టుకుని ఒక్కొక్క షేర్​తో క్రెడిబిలిటీ పెంచుకున్న ఘనత ధీరూభాయ్​ అంబానీదైతే… చిన్నకొడుకు అనిల్​ మాత్రం ‘జీరో’కి జారిపోయాడు. తలకు మించిన అప్పులు చేస్తే రిజల్ట్​ ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక ఉదాహరణగా మిగిలాడు.

నా చేతిలో చిల్లి గవ్వ లేదు. నేనిప్పుడు జీరో’ అని ఒక సాధారణ కిరాణా కొట్టు యజమాని సైతం చెప్పలేడు. కానీ, ఒకప్పుడు ప్రపంచ ధనవంతుల్లో ఆరోవాడైన అనిల్​ అంబానీ మాత్రం చెబుతున్నారు. అదికూడా ఒక ఇంటర్నేషనల్​ కోర్టులో! తన కంపెనీ రిలయెన్స్​ కమ్యూనికేషన్స్​ (ఆర్​కామ్​) కోసం ఏడేళ్ల క్రితం తీసుకున్న అప్పులకు సంబంధించి లండన్​లోని ఇంగ్లాండ్​ అండ్​ వేల్స్​ హైకోర్టులోని కమర్షియల్​ డివిజన్​లో వివాదం నడుస్తోంది. అప్పట్లో 92.5 కోట్ల డాలర్లు అప్పులిచ్చిన మూడు చైనా బ్యాంకులు… ఇండస్ట్రియల్​ అండ్​ కమర్షియల్​ బ్యాంక్ ఆఫ్​ చైనా (ఐసీబీసీ), చైనా డెవలప్​మెంట్​ బ్యాంక్​, ఎక్స్​పోర్ట్​ ఇంపోర్ట్​ బ్యాంక్​ ఆఫ్​ చైనా కోర్టు కెక్కాయి. వీటికి అనిల్​ అంబానీ వ్యక్తిగత గ్యారంటీ ఇచ్చారు కాబట్టి, అప్పులు వడ్డీతోపాటు చెల్లించాలని డిమాండ్​ చేస్తున్నాయి. 2017 వరకు అప్పులు కొంత కొంత తీరుస్తున్నా 2017 నుంచి చెల్లించడం మానేసింది ఆర్​కామ్​. ప్రస్తుతానికున్న బాకీ మొత్తం 70 కోట్ల డాలర్లకు (రూపాయల్లో సుమారు అయిదు వేల కోట్లు) చేరింది. ఈ మొత్తానికి సంబంధించి 10 కోట్ల డాలర్లు (సుమారు 715 కోట్ల రూపాయలు) డిపాజిట్​ చేయమని కోర్టు ఆరు వారాల గడువు ఇచ్చింది. ఆ సందర్భంలోనే అనిల్​ అంబానీ తన ఆస్తి అంతా హరించుకుపోయిందని, తన గ్రూప్​ ఈక్విటీ విలువ 8.24 కోట్ల డాలర్లకు పడిపోయిందని చెప్పారు. అంటే, ఆయన కంపెనీల విలువ రూ. 580 కోట్ల మాత్రమే.

అనిల్​ అంబానీకి ఇలాంటి పరిస్థితి ఎదురవడం కొత్తేమీ కాదు. పోయినేడాది మన సుప్రీంకోర్టులో కూడా ఆయనకు చుక్కెదురైంది. ఎరిక్​సన్​ ఏబీతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారన్న కేసులో 550 కోట్ల రూపాయలు చెల్లించాలని, నెల్లాళ్లలో చెల్లించనట్లయితే జైలుకు పంపుతామని సుప్రీం హెచ్చరించింది. చివరి క్షణంలో అనిల్​ అన్న ముఖేశ్​ అంబానీ ఆదుకోవడంతో ఆ గండం నుంచి బయటపడ్డారు.

అప్పట్లోనే అనిల్​ గ్రూప్ భవిష్యత్తుపై అందరిలోనూ అనుమానాలు రేకెత్తాయి. ఎందుకంటే, ఆ గ్రూప్​లోని నాలుగు సంస్థల అప్పులు సుమారు 1300 కోట్ల డాలర్ల (రూపాయల్లో 93 వేల కోట్లు) వరకు ఉన్నాయి. అనిల్​ హవా ఫుల్​ స్వింగ్​లో ఉన్న రోజుల్లో… తన ఆర్​కామ్​ కంపెనీకి అప్పు తీసుకోవడం కోసం 2011లో ఆయన బీజింగ్​ వెళ్లి బ్యాంకులతో స్వయంగా మాట్లాడుకున్నారు. ఐసీబీసీ చైర్మన్​ జియాంగ్​ జియాంపింగ్​తో, ఇతర బ్యాంకుల హెడ్​లతో ‘పర్సనల్​ గ్యారంటీ’ ఇవ్వడానికి రెడీ అయ్యారు. రిలయెన్స్​ కమర్షియల్​ అండ్​ ట్రెజరీలో టాప్​ అధికారి హసిత్​ శుక్లాకి పవర్​ ఆఫ్​ అటార్నీ​ ఇవ్వడంతో… ఆయన అనిల్​ అంబానీ తరఫున పర్సనల్​ గ్యారంటీ పత్రంపై సంతకాలు చేశారు. ఈ విషయాలనే ఐసీబీసీ అడ్వకేట్​ బంకిం థంకీ కోర్టుకు తెలిపారు. అయితే, అటువంటి పవర్​ ఆఫ్​ అటార్నీ​ ఏదీ శుక్లాకి ఇవ్వలేదని ఇప్పుడు అనిల్​ తరఫు అడ్వకేట్ రాబర్ట్​ హోవ్​ అంటున్నారు.  కాబట్టి ఆ మూడు బ్యాంకులకు అనిల్​ గ్యారంటీ ఏదీ ఉండదన్నది వాళ్ల వాదన.

ఈ దివాలా పరిస్థితి అనిల్​ సొంతంగా తెచ్చుకున్నదేనంటారు బిజినెస్​ ఎనలిస్టులు. 2006లో రిలయెన్స్​ ఎంపైర్​ నుంచి తన వాటాను తీసేసుకున్నప్పటి నుంచీ చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావంటారు. ‘కర్లో దునియా ముట్టీ మే’(ప్రపంచాన్ని గుప్పిట్లోకి తెచ్చుకో).. ఒకప్పుడు రిలయెన్స్​ కమ్యూనికేషన్స్ ట్యాగ్​లైన్​.​ చివరికి ఆయన కమ్యూనికేషన్స్​  రంగానికే గుడ్​బై చెప్పాల్సి వచ్చింది.

అనిల్​ రాత్రికిరాత్రే జీరోగా మారిపోలేదు. దాదాపు పదేళ్లుగా ఆయన పతనం ఒక్కొక్క మెట్టుగా దిగుతూ వచ్చింది. 2008లో ఆర్​కామ్ విలువ దాదాపు లక్షా 66 వేల కోట్లు. 2019లో రూ.1,687 కోట్లకు పడిపోయింది. అప్పటి విలువతో పోల్చితే ఒక్క శాతం మాత్రమే. దీన్నిబట్టి అనిల్​ అంబానీ వ్యాపారం ఎంతలా దిగజారిందో అర్థమవుతోంది.

టీనాతో మనువు

అనిల్​ అంబానీ భార్య మాజీ హీరోయిన్​ టీనా మునిమ్​. గుజరాతీ జైన్​ కుటుంబానికి చెందిన టీనా… అనిల్​ కంటే మూడేళ్లు పెద్దది. ఓ సిన్మా ఫంక్షన్​లో టీనా మునిమ్​ని చూసి, మనసు పారేసుకున్నారు. 1991లో కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లాడారు. అయితే, టీనా మునిమ్​తో ధీరూభాయ్​కి అంతకుముందే పరిచయముందని అంటారు. రిలయెన్స్​ టెక్స్​టైల్స్​ ‘ఓన్లీ విమల్​’ పేరుతో చీరలు, డ్రెస్​ మెటీరియల్​, విండో కలెక్షన్స్​, బెడ్​ క్లాత్​ తయారు చేసే రోజుల్లో… టీనా ఆర్ట్​ కలెక్షన్​ ఎగ్జిబిషన్లకోసం ధీరూభాయ్​ దగ్గరకెళ్లింది. ఆమె మాటతీరు, వ్యవహార దక్షత, ఆలోచనలు చూసి తన కొడుక్కిచ్చి పెళ్లి చేశారనికూడా చెబుతారు. ఏమైనప్పటికీ… ఈ జంట ఒక్కటైంది. వీళ్లకు ఇద్దరు మగ పిల్లలు.

హెలికాఫ్టర్, లగ్జరీ కార్లు, యాచ్​..

అనిల్ అంబానీకి చాలా ఇష్టాలున్నాయి. హెలికాఫ్టర్ లో తిరగడమన్నా, స్పీడు కార్లల్లో జర్నీ చేయడమన్నా ఆయనకు చాలా ఇష్టం. దీని కోసం కోట్ల రూపాయలు పెట్టి పదికి పైగా లగ్జరీ కార్లను కొన్నాడంటారు. అలాగే ముంబైలో ఒక ఏరియా నుంచి మరో ఏరియాకు వెళ్లడానికి హెలికాఫ్టర్  ఉపయోగిస్తారు. సౌత్ ముంబైలోని ఇంటి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరాన నవీముంబైలో ఉన్న ‘ధీరూబాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీ’ కి వెళ్లడానికి అనిల్ హెలికాఫ్టర్ ఉపయోగించేవారు. వీటితో పాటు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ బోట్​లలో ఒకటి అనిల్ దగ్గర ఉంది.

గంట కొట్టగానే షేర్​ ఢమాల్​

2008 ఫిబ్రవరి 11వ తేదీని షేర్​ మార్కెట్​ మరచిపోదు. అనిల్​ అంబానీ ప్రమోట్​ చేసిన రిలయెన్స్​ పవర్ 11,563 కోట్ల రూపాయలకోసం ఐపీఓకి వెళ్లింది. నాన్​–రిటైల్​ ఇన్వెస్టర్లకు 450 చొప్పున, రిటైల్​ ఇన్వెస్టర్లకు 430 చొప్పున షేర్​ ఫిక్స్​ చేశారు. ఆశ్చర్యంగా 72 రెట్లు ఎక్కువగా సబ్​స్ర్కయిబ్​ అయింది. మొత్తం ఏడు లక్షల కోట్లకు పైగా కంపెనీ కలెక్ట్​ చేసింది. అనిల్​ షేర్​ లిస్టింగ్​ అయినట్లుగా గంట కొట్టగానే 19 శాతం పెరిగి 538 రూపాయలకు వెళ్లిపోయింది. ఈ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. నాలుగో నిమిషానికల్లా షేర్​ ధర పడిపోవడం మొదలైంది. ఒక దశలో 350కి పడిపోయి, చివరికి 372.50 దగ్గర క్లోజ్​

ముఖేశ్​తో విడిపోయినప్పుడు ..

ధీరూబాయ్ అంబానీ ఆస్తుల పంపకానికి సంబంధించి స్పష్టమైన వీలునామా రాయకుండానే 2002లో కన్నుమూశారు. తల్లి కోకిలా బెన్ చొరవ తీసుకుని చార్టర్ట్ అకౌంటెంట్​ ఎస్. గురుమూర్తి, బ్యాంకర్ కె.వి.కామత్​లను మధ్యవర్తులుగా పెట్టి 2005లో అంబానీ ఎంపైర్​ని వాటాలుగా విడగొట్టేశారు. ఈ పంపకం ద్వారా ముఖేశ్​కు పెట్రో కెమికల్స్ బిజినెస్ దక్కగా, టెలికం బిజినెస్‌ తమ్ముడు అనిల్​కు వచ్చింది. అంతేకాదు, ఒకరి వ్యాపారంలోకి  మరొకరు తలదూర్చరాదన్న  ఒప్పందం కూడా ఇద్దరి మధ్య కుదిరింది. అంటే అన్న చేసే బిజినెస్​లోకి తమ్ముడు, తమ్ముడి వ్యాపారంలోకి అన్న తలదూర్చకూడదు. తమ ఎంపైర్ల పేర్లుకూడా వేర్వేరుగా మార్చుకున్నారు. ముఖేశ్​ అంబానీ సంస్థ పేరు రిలయెన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ (ఆర్​ఐఎల్​)గానూ,  అనిల్​ సంస్థ పేరు ‘అనిల్​ ధీరూభాయి అంబానీ గ్రూప్​ (అడాగ్​)’గానూ మారిపోయాయి.

ఆస్తుల పంపకంలో తన వంతుగా రిలయన్స్ కమ్యూనికేషన్స్​ (ఆర్​కామ్)ను తీసుకున్నారు అనిల్ అంబానీ.  ల్యాండ్​ లైన్లకే కటకటలాడుతున్న సమయంలో… మొబైల్స్​ ఎదుగుదలను ఊహించారు. ఇంతవరకు బాగానే ఉన్నా  లాభాల బాట పట్టించడానికి తగ్గట్టు ప్లాన్స్ వేయడంలో అనిల్ ఫెయిల్ అయ్యాడంటారు బిజినెస్ పెద్దలు. రిలయన్స్ టెలికం, రిలయన్స్ ఇన్ ఫ్రా, రిలయన్స్ కేపిటల్, రిలయన్స్ నేచురల్ రిసోర్సెస్, పవర్​ను అనిల్ తీసుకున్నారు. సినిమా రంగంపై ఆసక్తితో ‘రిలయెన్స్​ ఎంటర్​టైన్​మెంట్​’ ఆరంభించారు.

ఇంటా బయటా శత్రువులే

బిజినెస్​తోపాటు ఇతర విషయాల్లోనూ కోర్టులకు వెళ్లటంతో అనిల్​ అంబానీకి ఫ్యామిలీలోనూ, బయట శత్రువులు పెరిగారు. క్లోజ్​గా ఉన్నోళ్లు, నమ్మినోళ్లు నట్టేట ముంచారు. పరువు నష్టం కోరుతూ జర్నలిస్టులు, అనలిస్టులపై అనిల్ ఎన్నో దావాలు వేశారు.వీటివల్ల పర్సనల్ ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. వ్యాపారంలో పట్టిందల్లా బెడిసి కొట్టింది.

90 రోజుల్లోగా చెల్లించకపోతే?

అనిల్ అంబానీ గ్రూపునకు చెందిన అన్ని కంపెనీలు ప్రస్తుతం నష్టాల్లోనే ఉన్నాయి. ప్రాఫిట్ మేకింగ్ వ్యాపారాలంటూ ఏమీ లేవు. కొత్తగా ఏదైనా బిజినెస్ పెడదామన్నా ఆయన దగ్గర కేపిటల్ లేదంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుందామనుకున్నా  ఎవరూ ఇచ్చే పరిస్థితి లేదు. బ్యాలెన్స్ షీట్ అలా ఉంది. వివిధ సంస్థల  చేసిన అప్పులు తొంభై రోజుల్లోగాచెల్లించాలన్న నిబంధనలున్నాయి. లేకపోతే రూల్స్ ప్రకారం అనిల్ అంబానీని  డీఫాల్టర్​గా ప్రకటించే అవకాశాలు లేకపోలేదు.

సొంత విమానం​

అనిల్​ అంబానీకి లగ్జరీ విమానాలున్నాయి. ఫాల్కన్​ 7ఎక్స్​, ఫాల్కన్​ 2000 కేటగిరీకి చెందిన ఈ విమానాల్లో ఇంటీరియర్​ మొత్తం సూపర్​ లగ్జరీ లెవెల్లో ఉంటాయంటారు. దుబాయ్​లో జగదేక సుందరి శ్రీదేవి చనిపోయినప్పుడు ఆమె బాడీని తీసుకురావడానికి అనిల్​ తన ప్రైవేటు విమానం పంపించారు.

దివాలా తీసినట్లు చెప్పుకున్న అనిల్​ అంబానీ భవిష్యత్​లో ఏం చేయబోతున్నారనే ప్రశ్న తెరపైకి వస్తోంది. రిలయెన్స్​ ఇఫ్రా, రిలయెన్స్​ పవర్​ వంటి సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయినా అసెట్​ మేనేజ్​మెంట్​ సంస్థ రిలయెన్స్​ నిప్పన్​ కాస్త బెటర్​గానే కనిపిస్తోంది. జియోతో రిలయెన్స్​ రేంజ్​ని మరో లెవల్​కి తీసుకెళ్లిన ముఖేశ్​ అంబానీ వారసుల మాదిరిగానే అనిల్​ కొడుకులు అద్భుతాలు సృష్టిస్తారేమో చూడాలి. పెద్ద కొడుకు అన్​మోల్​ ఇప్పటికే ఫైనాన్షియల్​ సర్వీసెస్​ బిజినెస్​లో సత్తా చాటుతున్నాడు. ​