
- మోదీ చాలా తెలివైన వ్యక్తి
- మేమిద్దరం మంచి స్నేహితులం
- ప్రపంచంలోనే భారత్ అధికంగా టారిఫ్ విధించే దేశాల్లో ఒకటి
- త్వరలోనే సుంకాలను తగ్గిస్తుందని ఆశిస్తున్నా అంటూ కామెంట్స్
న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ ప్రశంసల్లో ముంచెత్తారు. మోదీ చాలా తెలివైన వ్యక్తి అని కొనియాడారు. ఆయన గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అంటూ కితాబిచ్చారు. శుక్రవారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ సమధానమిచ్చారు. ‘భారత ప్రధాని మోదీ ఇటీవలే అమెరికాలో పర్యటించారు. ఆయన చాలా తెలివైన వ్యక్తి. మేమిద్దరం మంచి స్నేహితులం. మా మధ్య మంచి చర్చలు జరిగాయి. అవి ఇరుదేశాలకు ఉపయోగకరమైనవిగా భావిస్తున్నా” అని పేర్కొన్నారు.
భారత్తో నాకున్న సమస్య సుంకాలే
భారత ప్రజలకు గొప్ప ప్రధాని ఉన్నారని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ‘‘భారత్తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ దేశంతో నాకున్న ఏకైక సమస్య టారిఫ్‌లే. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఇండియా ఒకటి. అయితే, ఇటీవల జరిపిన చర్చలకు అనుగుణంగా వాటిని భారత్ భారీగా తగ్గిస్తుందని నమ్ముతున్నా. ఏప్రిల్ 2న వారు మన దిగుమతులపై ఎంత సుంకాలు వసూలుచేస్తే .. నేను వారి నుంచి అంతే వసూలు చేస్తా’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికాలోకి ప్రవేశించే అన్ని దిగుమతి చేసుకున్న వాహనాలపై 25 శాతం టారిఫ్‌ను ప్రకటించిన మరుసటి రోజే ట్రంప్‌నుంచి ఈ ప్రకటన వెలువడింది. ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్న ఈ సుంకాలు.. విదేశాల్లో అసెంబుల్ చేసిన అమెరికన్ బ్రాండ్‌లతో సహా అమెరికాలో దాదాపు సగం వాహనాల సేల్స్ పై ప్రభావం చూపుతాయి.