సీఎం కేసీఆర్ అన్న కుమార్తె రమ్యా రావు డీజీపీని కలిశారు. తన కొడుకు రితేష్ రావు గురువారం నుంచి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులమంటూ కొందరు వ్యక్తులు తమ ఇంటికి వచ్చారని.. తన కొడుకు లేడని చెప్పినా వినకుండా ఇల్లంతా వెతికారని చెప్పారు. ఆ రోజు నుంచి తన కొడుకు కన్పించకుండా పోయాడని రమ్యా రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కొడుకు ఆచూకీ తెలపాలని డీజీపీని కోరారు. కమిషనర్ తో మాట్లాడి తన కొడుకు ఆచూకీ విషయం చెబుతామని అడిషనల్ డీజీపీ తెలిపారన్నారు. మహిళా పోలీసులు లేకుండా అర్ధరాత్రి తన ఇంటికి వచ్చిన బంజారా హిల్స్ పోలీసులు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అసెంబ్లీలో దొంగలు, దుర్మార్గులకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని రమ్య ఆరోపించారు. కాగా రాష్ట్రంలోని వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ సహా పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు సమాచారం. అరెస్ట్ చేసిన వారిలో ఎన్ఎస్యూఐ నేత రితేష్ రావు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.