ప్రజల గుండెల్లో ఉన్న నా కొడుకు నేతల గుండెల్లో లేకపాయే : శ్రీకాంతాచారి తల్లి

కోదాడ, వెలుగు: తన కొడుకు నాలుగు  కోట్ల ప్రజల గుండెల్లో ఉన్నాడు కానీ, నాయకుల గుండెల్లో లేడని మలిదశ తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడ బాయ్స్‌ హైస్కూల్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన  ‘గద్దరన్న యాదిలో’ కార్యక్రమంలో గద్దర్‌‌ కొడుకు సూర్యం, కళాకారులు నల్గొండ గద్దర్ నర్సిరెడ్డి, వేమూరి పుష్ప, రాంబాబుతో కలిసి పాల్గొన్నారు. 

ఆమె మాట్లాడుతూ.. శ్రీకాంతాచారి రాష్ట్ర ఏర్పాటు కోసం ఆత్మాహుతి చేసుకున్నప్పుడు అన్ని పార్టీల నేతలు స్పందించారన్నారు. అప్పటి ప్రజారాజ్యం చీఫ్  చిరంజీవి రూ. లక్ష పంపించారని,  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు బీఆర్‌‌ఎస్‌ నేతలు కూడా సాయం చేశారన్నారు. చావు బతుకుల మధ్య ఉన్న తన కొడుకును చూసేందుకు వచ్చిన ఈటల రాజేందర్‌‌తో తాను చనిపోయినా పర్వాలేదు.. కేసీఆర్‌‌ లాంటి నాయకుడు ఉండాలని చెప్పాడన్నారు. తాను బతికినా రాష్ట్రం ఏర్పాటు కాకపోతే మళ్లీ  ప్రాణ త్యాగం చేస్తానని శ్రీకాంత్ చెప్పాడని భావోద్వేగానికి గురయ్యారు.  శ్రీకాంత్ చనిపోయినప్పుడు గద్దర్ స్వయంగా వచ్చి తన పాటలతో శ్మశానం వరకు వచ్చి త్యాగాన్ని కీర్తించారన్నారు. రాష్ట్రంలో ప్రతి అమరుడుకి న్యాయం జరగాలని, తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలని కోరారు.