
మెదక్, వెలుగు: ఎన్నికలకు దాదాపు ఆరు నెలల ముందు రాజకీయరంగ ప్రవేశం చేసిన మైనంపల్లి రోహిత్ రావు ఎమ్మెల్యేగా గెలుపొంది సంచలనం సృష్టించారు. నియోజకవర్గ చరిత్రలో 26 ఏళ్ల వయసులోనే అసెంబ్లీలో అడుగుపెడుతూ మరో రికార్డు సృష్టించారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు.. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ (ఎంఎస్ఎస్ఓ) చైర్మన్‌గా ఉన్న తన కొడుకు మైనంపల్లి రోహిత్ రావును ఎమ్మెల్యే చేయాలనే ఆకాంక్షతో గత ఫిబ్రవరిలో మెదక్ నియోజకవర్గంలో రీఎంట్రీ ఇచ్చారు.
గత ఏప్రిల్ నెల నుంచి నియోజకవర్గంలో ఎంఎస్ఎస్ఓ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. తద్వారా ప్రజల మద్దతు కూడగట్టుకున్న రోహిత్ రావు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ స్థానంలో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. అయితే బీఆర్ఎస్ హైకమాండ్ సిట్టింగ్ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికే మళ్లీ టికెట్ ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ రోహిత్‌రావు తండ్రి హన్మంతరావుతో కలిసి కాంగ్రెస్‌లో చేరగా ఆ పార్టీ హైకమాండ్ అతడికి మెదక్ టికెట్ ఇచ్చింది.
ఇదివరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, విశేష రాజకీయ అనుభవం ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డితో తలపడిన రోహిత్‌రావు 10,157 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి మామిళ్ల ఆంజనేయులు, టీపీసీసీ అధికార ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. ముఖ్యమైన నాయకులు అందరూ వెళ్లిపోయినప్పటికీ రోహిత్ రావు ఒంటరి పోరు చేసి విజయం సాధించారు.