
- పేకమేడల్లా కుప్పకూలిన బిల్డింగ్లు
- ఎక్కడికక్కడ దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జీలు
- భయంతో వీధుల్లోకి పరుగులుపెట్టిన జనం
- నిమిషాల వ్యవధిలోనే ఆరు సార్లు కంపించిన భూమి
- తీవ్రంగా ప్రభావితమైన సెంట్రల్ మయన్మార్
- రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతగా నమోదు
- బ్యాంకాక్లోనూ 7.3 తీవ్రతతో భూకంపం
- అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధాని మోదీ భరోసా
- ఇండియా, చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌లోనూ స్వల్ప ప్రకంపనలు
- బ్యాంకాక్‌లో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
న్యూఢిల్లీ: భూకంపం ధాటికి మయన్మార్, బ్యాంకాక్ చిగురుటాకులా వణికిపోయాయి. చాలా బిల్డింగ్లు పేక మేడల్లా కుప్పకూలిపోయాయి. జనమంతా భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. నిమిషాల వ్యవధిలోనే ఆరుసార్లు భూమి కంపించింది. మెయిన్ రోడ్లు, బ్రిడ్జీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆఫీసులు, షాపింగ్ మాల్స్ గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న మెట్రో రైళ్లు ఊగిపోయాయి. సెంట్రల్ మయన్మార్‌లో శుక్రవారం మధ్యాహ్నం భూమి కంపించడంతో 144 మందికి పైగా చనిపోయారు. 800 మంది వరకు గాయపడ్డారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. బ్యాంకాక్‌లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మయన్మార్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై అత్యధికంగా 7.7 నమోదుకాగా, అత్యల్పంగా 4.3గా రికార్డయింది. భూకంపం ధాటికి పెద్ద పెద్ద భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. పలుచోట్ల ఎత్తైన ఆలయాలు, గోపురాలు కుప్పకూలాయి. మండాలెలో ఇర్రవడ్డీ నదిపై ఉన్న అతి పురాతన అవా బ్రిడ్జి కూలిపోయింది. నేపిడాలోని వెయ్యి పడకల హాస్పిటల్ కుప్పకూలింది. ఇక్కడ భారీగా ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సెంట్రల్ మయన్మార్ లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలో మీటర్ల దూరంలో 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే గుర్తించింది. థాయ్‌లాండ్ నూ భూకంపం వణికించింది.
బ్యాంకాక్‌లో 7.3 తీవ్రతతో రెండుసార్లు భూమి కంపించడంతో బిల్డింగ్లు కుప్పకూలాయి. 8 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఆ దేశ స్టాక్ ఎక్స్ఛేంజీ కార్యకలాపాలను నిలిపేశారు. ప్రకంపనలకు ఏకంగా మెట్రో రైళ్లు కూడా ఊగిపోయాయి. బిల్డింగ్‌లపై ఉన్న ఓపెన్ స్విమ్మింగ్ పూల్స్లోని నీళ్లు కిందకు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. థాయ్‌లాండ్ ప్రధాని షినవత్ర దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అదేవిధంగా చైనాలోని యునాన్ ప్రావిన్స్, బంగ్లాదేశ్, లావోస్, వియత్నాం, ఇండియాలోనూ భూమి కంపించింది.
అంతర్జాతీయ సాయం కోరిన మయన్మార్
భూకంపం ధాటికి సెంట్రల్ మయన్మార్ తీవ్రంగా దెబ్బతిన్నది. సాగింగ్, మండాలే, క్యూక్సే, పైన్ ఊ ల్విన్, ష్వెబోతో సహా అనేక పట్టణాల్లోని భవనాలు కుప్పకూలాయి. 144 మంది వరకు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. అయితే, శిథిలాలు తొలగించే కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతున్నది. మయన్మార్ ప్రభుత్వం అంతర్జాతీయ సాయం కోరింది. మండాలేలోని అతిపురాతనమైన ‘మండాలే ప్యాలెస్’తీవ్రంగా దెబ్బతిన్నది. సాగింగ్ టౌన్‌షిప్‌లోని ఒక వంతెన పూర్తిగా కుప్పకూలింది. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాలు తొలగిస్తూ క్షతగాత్రులను బయటికి తీసుకొస్తున్నాయి. కొన్నిచోట్ల ఆలయ గోపురాలు కూలిపోయాయి. ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. పలు మసీదుల్లోని పైకప్పులు కూలిపోయాయి. రంజాన్ కావడంతో మసీదుల్లో పెద్ద సంఖ్యలో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు.
అత్యంత శక్తిమంతమైన భూకంపమిది: అమెరికా
మయన్మార్‌లో వచ్చిన భూకంపం అత్యంత శక్తిమంతమైందని అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. రెండేండ్ల కింద ఇంతే తీవ్రతతో టర్కీ, సిరియాలో భూకంపం సంభించిందని గుర్తు చేసింది. అప్పుడు భారీగా ప్రాణనష్టం చోటు చేసుకున్నదని తెలిపింది. ముఖ్యంగా మయన్మార్, థాయ్‌లాండ్ జనసాంద్రత అత్యధికంగా ఉన్న ప్రదేశాలు కావడంతో వీటిని రెడ్ ఈవెంట్లుగా వ్యవహరిస్తామని వెల్లడించింది. రెండేండ్ల కింద టర్కీలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించడంతో 53 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మయన్మార్, థాయ్‌లాండ్‌లోనూ భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని తెలిపింది.
30 అంతస్తుల బిల్డింగ్.. ఇలా
కుప్పకూలిందిబ్యాంకాక్ చతుచక్ ఏరియాలో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల బిల్డింగ్ క్షణాల్లో కూలిపోయింది. అందులో 84 మంది కార్మికులు చిక్కుకున్నారు. గవర్నమెంట్ ఆఫీసుల కోసం ఈ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సహాయక చర్యలు చేపట్టండి: థాయ్‌లాండ్ ప్రధాని
బ్యాంకాక్‌లోని ప్రతి భవనాన్ని భద్రత దృష్ట్యా తనిఖీ చేయాల్సి ఉంటుందని థాయ్‌లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్ర ప్రకటించారు. పరిస్థితిని పర్యవేక్షించి, సహాయక చర్యలు చేపట్టాలని ఆమె సంబంధిత సంస్థలను ఆదేశించారు. రెస్క్యూ ఆపరేషన్ స్పీడప్ చేయాలన్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని సేఫ్‌గా బయటికి తీసుకురావాలని సూచించారు. మయన్మార్, థాయ్‌లాండ్‌లో భూకంపంతో గాయపడిన వారికి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకొచ్చింది. దుబాయిలోని తన లాజిస్టిక్స్ హబ్‌ను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది.
మయన్మార్పైనే ఎందుకంతా ప్రభావం?
ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే అవకాశమున్న ప్రాంతాల్లో మయన్మార్ ఒకటి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మా మైక్రోప్లేట్‌ల మధ్య మయన్మార్ ఉంటుంది. ఈ ప్రాంతాన్నే ‘సాగింగ్ ఫాల్ట్’గా వ్యవహరిస్తారు. అక్కడ సాగింగ్ పేరుతో పట్టణం ఉండటంతో ఆ ప్రాంతాన్ని అలా పిలుస్తుంటారు. భూమి పొరల అమరికలో లోపాలు ఉండటాన్నే ఫాల్ట్ అంటారు. మయన్మార్‌లో ఇది దాదాపు 1,200 కి.మీల మేర విస్తరించింది. భూగర్భంలో పొరల అమరికల వల్ల రెండు భూభాగాలు ఒకదానికొకటి కదులుతుంటాయి. ఈ కదలికలు ఏడాదికి 11 మి.మీ నుంచి 18 మి.మీ వేగంగా జరుగుతున్నట్లు సైంటిస్టులు అంచనా వేశారు. 18 మి.మీ చాలా ఎక్కువ అని, దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్తున్నారు. ఇవి ఇలాగే కొనసాగుతుండటంతో భూగర్భంలో ఒత్తిడి పెరిగి భూకంపాలకు దారితీస్తుంటాయి.
మయన్మార్ భూకంపాల చరిత్ర
1930 నుంచి 1956 మధ్య మయన్మార్‌లో రిక్టర్ స్కేలుపై 6 తీవ్రత కంటే ఎక్కువగా 14 భూకంపాలు నమోదయ్యాయి. అందులో 7కు పైన ఆరు సార్లు భూమి కంపించింది. 1946లో 7.7 తీవ్రతతో రాగా.. 1956లోనూ 7.1 తీవ్రతతో భూమి కంపించింది. 1988లో షాన్‌లో, 2004లో కోకో ద్వీపంలో వచ్చిన బలమైన ప్రకంపనలతో వందలాది మంది చనిపోయారు. 2011లో టార్లేలో వచ్చిన భూకంపంలో 151 మంది ప్రాణాలు కోల్పోయారు, 2016లోనూ 6.9 తీవ్రతతో రాగా ముగ్గురు చనిపోయారు. తాజాగా 7.7 తీవ్రతతో ఇది సంభవించింది.
కుప్పకూలిన వెయ్యి పడకల హాస్పిటల్
.మయన్మార్ రాజధాని నేపిడాలో వెయ్యి పడకల హాస్పిటల్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అత్యధిక ప్రాణ నష్టం ఇక్కడే ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కొత్తగా నిర్మించిన ఈ హాస్పిటల్‌కు ఇంకా పేరు పెట్టలేదు. ఈ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న తమవారి కోసం శిథిలాలు తొలగిస్తూ కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. గాయపడిన వారికి హాస్పిటల్ బయటే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. భూకంపం సంభవించే టైమ్‌లో హాస్పిటల్ లో 300 మంది వరకు పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది ఉన్నట్లు అధికారులు వివరించారు. హాస్పిటల్ ఎంట్రెన్స్ గేట్ కూలిపోయింది. మళ్లీ భూకంపం సంభవించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో గాయపడిన వారికి మయన్మార్ వీధుల్లోనే డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు.
బ్యాంకాక్‌లోని ఇండియన్ ఎంబసీ టోల్ ఫ్రీ నంబర్
బ్యాంకాక్‌లోని ఇండియన్ ఎంబసీ అప్రమత్తమైంది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నది. ఇండియన్స్ ఎవరూ ఇబ్బందులు ఎదుర్కొలేదని ఎంబసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఇండియన్ల కోసం హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే.. థాయ్‌లాండ్‌లోని ఇండియన్స్ ఎమర్జెన్సీ నంబర్ +66 618819218ను సంప్రదించాలని సూచించారు. బ్యాంకాక్‌లోని ఇండియన్ ఎంబసీ, చియాంగ్ మాయీ నగరంలోని కాన్సులేట్ సభ్యులంతా సేఫ్‌గా ఉన్నారని ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.
ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఫ్యామిలీ సేఫ్
గోదావరిఖని, వెలుగు: బ్యాంకాక్‌లో ఓ ఫంక్షన్ కు అటెండ్ అయిన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ భార్య మనాలీ ఠాకూర్, కూతురు, చిన్న కొడుకు, అల్లుడు భూకంపం నుంచి సేఫ్ గా బయటపడ్డారు. ఓ హోటల్ లోని 35వ ఫ్లోర్ లో వారు బస చేశారు. అదే ఏరియాలో భూకంపం సంభవించింది. అయితే, దీనికి ముందే ఎమ్మెల్యే ఫ్యామిలీ ఇండియాకు తిరిగి వచ్చేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నది.
నిలిచిపోయినఅత్యవసర సేవలు
బ్యాంకాక్‌లో మెట్రో, రైలు సేవలను నిలిపివేశారు. అన్ని విమాన సర్వీసులు రద్దు చేశారు. థాయ్‌లాండ్‌కు వచ్చే విమానాలను దారి మళ్లించారు. ఎయిర్‌పోర్టు, రైల్వేతో పాటు మెట్రో స్టేషన్లలోనూ ఆస్తి నష్టం సంభించింది. దేశ స్టాక్ ఎక్స్ఛేంజి కార్యకలాపాలను
సస్పెండ్ చేశారు.
నిలిచిపోయినఅత్యవసర సేవలు
బ్యాంకాక్‌లో మెట్రో, రైలు సేవలను నిలిపివేశారు. అన్ని విమాన సర్వీసులు రద్దు చేశారు. థాయ్‌లాండ్‌కు వచ్చే విమానాలను దారి మళ్లించారు. ఎయిర్‌పోర్టు, రైల్వేతో పాటు మెట్రో స్టేషన్లలోనూ ఆస్తి నష్టం సంభించింది. దేశ స్టాక్ ఎక్స్ఛేంజి కార్యకలాపాలను
సస్పెండ్ చేశారు.
అన్ని విధాలా ఆదుకుంటాం: ప్రధాని మోదీ
మయన్మార్, థాయ్‌లాండ్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘మయన్మార్, థాయ్‌లాండ్‌లో భూకంపం సంభవించిందని తెలిసి ఆందోళన చెందాను. అందరూ సేఫ్‌గా ఉండాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. గాయపడినవాళ్లంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అవసరమైన సాయం అందించేందుకు ఇండియా సిద్ధంగా ఉన్నది. సహాయక చర్యలపై ఆయా దేశాల ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని కేంద్ర విదేశాంగ శాఖకు సూచించాను’’అని మోదీ తెలిపారు.