మయన్మార్ భూకంపం.. 270 మంది మిస్సింగ్ .. 2 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య

మయన్మార్ భూకంపం.. 270 మంది మిస్సింగ్ .. 2 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య
  • వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన జుంటా ప్రభుత్వం
  • మయన్మార్​లో కొనసాగుతున్న సహాయక చర్యలు

మాండలే: భారీ భూకంప విలయంతో అల్లాడుతున్న మయన్మార్​లో వారంపాటు సంతాప దినాలను ప్రకటించారు. శుక్రవారం సంభవించిన భూకంపంతో జరిగిన ప్రాణనష్టాలకు సంతాపంగా  ఏప్రిల్ 6 వరకు జాతీయ జెండాలను సగం ఎత్తులో ఎగురవేస్తామని సైనిక సర్కారు (జుంటా) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. మరణాల సంఖ్య 2,056 కు పెరిగిందని, 3,900 మందికి పైగా గాయపడ్డారని, 270 మంది ఆచూకీ ఇంకా లభించడంలేదని  సైనిక దళాలు  తెలిపాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నాయి. మయన్మార్ దేశాన్ని 7.7 తీవ్రతతో అత్యంత శక్తిమంతమైన భూకంపం వణికించిన విషయం తెలిసిందే. 

శుక్రవారం మధ్యాహ్నం సమయంలో నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ప్రకంపనల కారణంగా కమ్యూనికేషన్‌‌ వ్యవస్థ తెగిపోవడం, రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నదని స్థానిక అధికారులు వెల్లడించారు. 

మాండలే వీధుల్లో మృతదేహాలు కుళ్లిపోతుండటంతో దుర్గంధం వెలువడుతున్నది. అలాగే, వరుసగా మూడోరోజు ప్రజలు రోడ్డు సైడ్​ టెంట్లలోనే పిల్లలతో గడుపుతున్నారు. మళ్లీ భూంకంపం వస్తుందేమోననే భయంతో ఇండ్లవైపు వెళ్లడం లేదు. కాగా, మృతుల్లో ముగ్గురు చైనా పౌరులు, ఇద్దరు ఫ్రెంచ్ ​సిటిజన్స్​ ఉన్నట్టు ఆయా దేశాల మీడియాలు వెల్లడించాయి.

ప్రార్థనలు చేస్తూనే 700 మంది సజీవ సమాధి
రంజాన్‌‌ శుక్రవారం వేళ ముస్లింలు ప్రార్థనలు చేస్తుండగా భూకంపం సంభవించడంతో మయన్మార్​ వ్యాప్తంగా 700 మంది శిథిలాల కింద సజీవ సమాధి అయ్యారు. ఈ విషయాన్ని అక్కడి ముస్లిం ఆర్గనైజేషన్‌‌ వెల్లడించింది. భారీ భూకంపంతో 60 మసీదులు తీవ్రంగా ధ్వంసమయ్యాయని స్ప్రింగ్‌‌ రివల్యూషన్‌‌ మయన్మార్ ముస్లిం నెట్‌‌వర్క్‌‌ కమిటీ తెలిపింది. మధ్యాహ్నం ప్రార్థనలు చేస్తుండగా ప్రకంపనలు రావడంతో మసీదుల శిథిలాల కింద చిక్కుకొని చాలామంది మృతిచెందినట్టు పేర్కొన్నది. అయితే, వీరి మరణాలను  మిలిటరీ ప్రభుత్వం వెల్లడించిన మృతుల సంఖ్యలో చేర్చారా లేదా? అనేదానిపై క్లారిటీ లేదు.

థాయ్​లాండ్లో శిథిలాల నుంచి కీలక పత్రాల చోరీకి యత్నం
భారీ భూకంపానికి థాయ్‌‌లాండ్‌‌ రాజధాని బ్యాంకాక్‌‌లో 33 అంతస్తుల భారీ భవనం కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ భవన శిథిలాలనుంచి కీలక డాక్యుమెంట్లను తీసుకెళ్లేందుకు యత్నిస్తూ నలుగురు చైనా వ్యక్తులు పట్టుబడ్డారు. ఈ హైరైస్​ బిల్డింగ్​ నిర్మాణంలో చైనా సంస్థకు సంబంధం ఉన్నదనే అనుమానంతో అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.

ఇదే సమయంలో ఈ భవనం వద్దకు నలుగురు చైనా వ్యక్తులు అక్రమంగా వెళ్లి కొన్ని పత్రాలను తీసుకునేందుకు యత్నించగా.. వారిని అరెస్టు చేశారు. అయితే, బీమా క్లెయిమ్‌‌ చేసుకోవడం కోసం 32 ఫైల్స్​తో కూడిన డాక్యుమెంట్​ను తీసుకెళ్లేందుకు వచ్చినట్లు వారు చెప్పారని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, భవనం కూలిన ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 19కి చేరినట్టు థాయ్​లాండ్​ అధికారులు వెల్లడించారు.