మయన్మార్​ భూకంప మృతుల సంఖ్య 2,700.. 4,521 మందికి గాయాలు..441 మంది గల్లంతు

మయన్మార్​ భూకంప మృతుల సంఖ్య 2,700.. 4,521 మందికి గాయాలు..441 మంది గల్లంతు
  • శిథిలాల కింద 50 మంది చిన్నారులు.. స్థానిక మీడియాలో కథనాలు
  • మృతుల సంఖ్య పెరిగే అవకాశం

నేపిడా: మయన్మార్​లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. మంగళవారం నాటికి మృతుల సంఖ్య 2,719కి చేరుకున్నదని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇప్పటివరకూ 4,521 మంది గాయపడగా.. ఇంకా 441 మంది ఆచూకీ లభించడం లేదు. కాగా, మయన్మార్ రాజధానిలో   భవనం శిథిలాల నుంచి ఓ 63 ఏళ్ల మహిళను రెస్క్యూ సిబ్బంది రక్షించారు. ఆమె 91 గంటలు శిథిలాల కిందే ఉన్నదని,  ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్టు ఫైర్​ డిపార్ట్​మెంట్​ తెలిపింది. 

మాండలే వీధుల్లో పరిస్థితి భయానకంగా ఉన్నదని,  మృతదేహాలు కుళ్లిపోతుండడంతో దుర్గంధం వెలువడుతున్నదని యూఎన్​ఏ సిబ్బంది తెలిపారు.   ఈ ప్రాంతంలో ప్రీ స్కూల్ కూలిపోవడంతో 50 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లు చనిపోయారన్నారు.  కాగా, భూకంపం సంభవించిన 72 గంటలు గడవడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారు బతికే అవకాశం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

10 వేలకు పైగా భవనాలు ధ్వంసం

శుక్రవారం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం మయన్మార్​ను అతలాకుతలం చేసింది. భూప్రకంపనలతో భారీగా ప్రాణనష్టంతోపాటు ఆస్తి నష్టం కూడా సంభవించింది.   మయన్మార్‌‌లోని రెండో అతిపెద్ద నగరమైన మాండలే,  నేపిడాకు సమీపంలో భూకంప కేంద్రం ఉండడంతో ఇక్కడ నష్టం ఎక్కువగా జరిగింది. మధ్య, వాయువ్య మయన్మార్​లో మొత్తం 10వేలకు పైగా భవనాలు కూలిపోయాయని లేదా తీవ్రంగా దెబ్బతిన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) వెల్లడించింది. 

భూకంప  ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, నీరు, షెల్టర్ తక్షణమే అందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని యునిసెఫ్​ బృందం పేర్కొంది. వివిధ దేశాల నుంచి వస్తున్న సహాయక బృందాలు భూకంప తాకిడి ప్రాంతాలకు చేరేందుకు ప్రభుత్వ, తిరుగుబాటు దళాల మధ్య జరుగుతున్న ఘర్షణలు అవరోధంగా మారాయి. ఈ పరిణామాల మధ్య మృతుల సంఖ్య ఎంతకు చేరుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.