
- 3,400 మందికి గాయాలు.. శిథిలాల కిందే వేలాది మంది?
- రోడ్లు, బ్రిడ్జీలు ధ్వంసమవడంతో సహాయక చర్యలకు ఆటంకం
- మయన్మార్‌లో శనివారం మళ్లీ ప్రకంపనలు
- మయన్మార్‌కు ఇండియా సహా పలు దేశాల సాయం
నేపిడా / బ్యాంకాక్: మయన్మార్‌లో శుక్రవారం సంభవించిన భారీ భూకంపంలో మృతి చెందినవారి సంఖ్య 1,644కు పెరిగిందని మిలిటరీ ప్రభుత్వం(జుంటా) శనివారం ప్రకటించింది. దాదాపు 3,408 మంది గాయపడ్డారని వెల్లడించింది. శిథిలాల కింద ఇంకా వేలాది మంది ఉండొచ్చని, మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని భావిస్తున్నారు. మయన్మార్ లో భూకంపం సృష్టించిన విధ్వంసం చాలా తీవ్ర స్థాయిలో ఉందని, మృతుల సంఖ్య 10 వేలు దాటిపోయే అవకాశం ఉందని యూఎస్ జియాలజికల్ సర్వే (యూఎస్ జీఎస్) తెలిపింది. శుక్రవారం మయన్మార్‌లోని రెండో అతిపెద్ద నగరమైన మాండలే సిటీకి సమీపంలో రిక్టర్ స్కేల్ పై 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ధాటికి పెద్ద పెద్ద భవనాలు, బ్రిడ్జీలు కుప్పకూలిపోగా, అనేక చోట్ల రోడ్లు రెండుగా చీలిపోయాయి.
వరుసగా రెండో రోజున శనివారం మధ్యాహ్నం కూడా మయన్మార్ లో 5.1 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం నాటి భూకంపంతో భారీగా ధ్వంసమైన మయన్మార్ రాజధాని నేపిడాకు సమీపంలో శనివారం మధ్యాహ్నం కూడా ప్రకంపనలు వచ్చాయి. తాజాగా 5.1 తీవ్రతతో భూమి కంపించింది. అయితే, ఈ ప్రకంపనల వల్ల మరింత నష్టం ఏమైనా జరిగిందా? అన్న దానిపై వివరాలు వెల్లడికాలేదు. మయన్మార్ నుంచి ఇండియాకూ ప్రకంపనలు వ్యాపించాయి.
ఈశాన్య భారత్ లోని మణిపూర్, మేఘాలయతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో భూమి కంపించింది. బంగ్లాదేశ్ లోని ఢాకా, ఛట్టోగ్రామ్ తో పాటు అటు చైనాలోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. మయన్మార్ కు ఆపన్న హస్తం అందించేందుకు భారత్ ‘ఆపరేషన్ బ్రహ్మ’ పేరుతో ప్రత్యేక మిషన్ ప్రారంభించింది. అత్యవసర మందులు, వస్తువులతోపాటు రెస్క్యూ టీమ్ లను కూడా పంపింది. అలాగే చైనా, రష్యా, సౌత్ కొరియా, అమెరికా, తదితర దేశాలూ మయన్మార్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి.
మందకొడిగా సహాయక చర్యలు
మయన్మార్ లో కొన్నేండ్లుగా అంతర్యుద్ధం జరుగుతుండటం, తాజాగా భూకంపం వల్ల రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసం కావడంతో శిథిలాల తొలగింపు, బాధితుల రెస్క్యూ చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. సరైన పరికరాలు, యంత్రాలు లేకపోవడంతో సహాయక సిబ్బంది వట్టి చేతులతోనే శిథిలాల తొలగింపునకు ప్రయత్నిస్తున్నారు. కాగా, శుక్రవారం భూకంపం వచ్చిన 11 నిమిషాల తర్వాత 6.4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. భారీ భూకంపానికి తోడు మళ్లీ పెద్ద ఎత్తున ప్రకంపనలు రావడంతో మరింత ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.
మయన్మార్‌లోని రెండో అతిపెద్ద నగరమైన మాండలే సిటీ విధ్వంసానికి కేంద్ర స్థానంగా మారిపోయింది. భూకంపం ధాటికి నేపిడా ఎయిర్ పోర్టులో కంట్రోల్ టవర్ సైతం కూలిపోయింది. సగాయింగ్ వద్ద ఇరవడ్డీ నదిపై ఉన్న వందేండ్ల నాటి వంతెన కుప్పకూలింది. దేశంలోని అనేక ప్రాంతాలకు నీళ్లు, కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
జుంటా చీఫ్‌కు మోదీ ఫోన్
మయన్మార్ మిలిటరీ ప్రభుత్వ అధినేత మిన్ ఆంగ్ హిలాంగ్ తో తాను ఫోన్ లో మాట్లాడానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ ఆపద కాలంలో మయన్మార్ కు అన్ని రకాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చానని తెలిపారు. భూకంప మృతులకు సంతాపం ప్రకటించానని పేర్కొన్నారు.
మమ్మల్ని ఆదుకోండి: జుంటా చీఫ్
కొన్నేండ్లుగా అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న మయన్మార్ కు ఇప్పుడు భారీ భూకంపం రూపంలో మరో సంక్షోభం ఎదురైంది. తమను ఆదుకోవాలంటూ జుంటా (మిలిటరీ సర్కార్) చీఫ్ మిన్ ఆంగ్ హిలాంగ్ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఏ దేశం వారైనా సరే, ఎవరైనా సరే.. వచ్చి మయన్మార్ ప్రజలకు సాయం చేయాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.
ప్రాణభయంతో మరో బిల్డింగ్ లోకి పోతే..
మాండలే సిటీలో ఎటు చూసినా బాధితుల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. కుప్పకూలిన భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయిన తమ ఆప్తులు అసలు బతికున్నారో, లేదో తెలియక జనం అల్లాడుతున్నారు. భూకంప సమయంలో ప్రమాదాల నుంచి బయటపడిన వారు ఆ భయానక దృశ్యాలను మీడియా ముందు పంచుకుని కంటతడి పెడుతున్నారు. మాండలే సిటీలోని ఓ బిల్డింగ్ లో తాను బాత్ రూంలో ఉండగా, భూకంపం వచ్చిందని.. వెంటనే తన కుటుంబసభ్యులు, ఆ భవనంలోని మిగతా వారితో కలిసి షెల్టర్ కోసం మరో బిల్డింగ్ లోకి వెళ్లగా.. మళ్లీ భూమి కంపించి ఆ భవనం కూడా కూలిపోయిందని ఓ బాధితుడు వెల్లడించాడు. తన నాయనమ్మ, ఆంటీ, అంకుల్ మాత్రం ఆ శిథిలాల కిందే చిక్కుకుపోయారని, అసలు వారు బతికి ఉన్నారో, లేదోనంటూ విలపించాడు.
బ్యాంకాక్‌లో కొనసాగుతున్న రెస్క్యూ
మయన్మార్ లో సంభవించిన భూకంపం ప్రభావంతో అక్కడికి 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న థాయిలాండ్ లోని బ్యాంకాక్ సిటీలోనూ పెద్ద ఎత్తున ప్రకంపనలు వచ్చాయి. పెద్ద పెద్ద హోటల్స్, ఇతర భవనాలు ఊగిపోయాయి. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలిపోగా, 10 మంది చనిపోయారు. శిథిలాల కింద ఇంకా40 మంది చిక్కుకుపోయారని భావిస్తున్నారు. సిటీ వ్యాప్తంగా అనేక ఇండ్లకు పర్రెలు ఏర్పడ్డాయి.
సిటీలో ఇతర పెద్ద భవనాలేమీ కూలిపోలేదని, ఇండ్లకు క్రాక్స్ వచ్చాయని మాత్రం 2 వేలకుపైగా కంప్లయింట్లు వచ్చాయని సిటీ గవర్నర్ ప్రకటించారు. కాగా, థాయిలాండ్ ప్రభుత్వం బ్యాంకాక్ లో ఎమర్జెన్సీ ప్రకటించింది. కుప్పకూలిన భవనం శిథిలాల కింద నుంచి 15 మంది ఆర్తనాదాలు వినిపించాయని, వారిని తక్షణమే కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని అధికారులు తెలిపారు.