మయన్మార్ భూకంపం పవర్ ఎంతంటే.. 334 అణుబాంబులేస్తే వచ్చేంత శక్తి !

మయన్మార్ భూకంపం పవర్ ఎంతంటే.. 334  అణుబాంబులేస్తే వచ్చేంత శక్తి !
  • పది నిమిషాల్లోనే 15 సార్లు కంపించిన భూమి
  • వరుసగా మూడోరోజూ ప్రకంపనలు
  • 1,700కు పెరిగిన మృతుల సంఖ్య.. వేలాదిగా క్షతగాత్రులు 
  • కొనసాగుతున్న సహాయక చర్యలు
  • థాయిలాండ్ లో 17కు చేరిన మరణాలు

నేపిడా/బ్యాంకాక్: మయన్మార్​లో రెండు రోజుల క్రితం సంభవించిన భారీ భూకంపం గత వందేండ్లలోనే అత్యంత శక్తిమంతమైనదని సీస్మాలజిస్టులు ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం దేశంలోని మాండలే సిటీకి సమీపంలో ఏర్పడిన భూకంపం ధాటికి ఏకంగా 334 అణుబాంబులు పేలినంత శక్తి విడులైందని అమెరికాకు చెందిన ప్రముఖ జియాలజిస్ట్ జెస్ ఫీనిక్స్ వెల్లడించారు.

పెద్ద ఖడ్గంతో భూమిని లోతుగా కట్ చేసినట్టుగా భూమి చీలిపోయిందని మరో సీస్మాలజిస్ట్ తెలిపారని ఈ మేరకు సీఎన్ఎన్ వార్తా సంస్థ ఓ కథనంలో పేర్కొంది. భూకంప కేంద్రం కేవలం10 కిలోమీటర్ల లోతులోనే ఉండటంతో విధ్వంసం తీవ్రత భారీగా పెరిగిందని వివరించింది. మయన్మార్ కు 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న థాయిలాండ్​కూ ప్రకంపనలు వ్యాపించాయని వెల్లడించింది.

మయన్మార్లో భూకంప మృతుల సంఖ్య ఆదివారం 1,700 దాటిందని, క్షతగాత్రుల సంఖ్య 3,400కు పెరిగిందని అధికారులు ప్రకటించారు. శిథిలాల కింద ఇంకా వందలాది మంది చిక్కుకుపోయారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. థాయిలాండ్​లో మృతుల సంఖ్య 17కు పెరిగింది. బ్యాంకాక్​లో కుప్పకూలిన 33 అంతస్తుల భవనం కింద ఇంకా 82 మంది చిక్కుకుపోయారని, వారిలో ఎవరూ బతికి ఉండే అవకాశాలు లేవని అక్కడి అధికారులు పేర్కొన్నారు.

వరుసగా మూడోరోజూ ప్రకంపనలు..
మయన్మార్​లోని మాండలే సిటీ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం కేవలం పది నిమిషాల్లోనే 15 భూకంపాలు వచ్చాయని యూఎస్ జీఎస్ ప్రకటించింది. వరుసగా మూడోరోజు ఆదివారం కూడా సిటీ సమీపంలో భూమి కంపించిందని తెలిపింది. శుక్రవారం రిక్టర్ స్కేల్ పై7.7 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం తర్వాత వరుసగా ప్రకంపనలు ఏర్పడ్డాయని, శనివారం కూడా మయన్మార్​లో 5.1 తీవ్రతతో ఒకసారి, 4.2 తీవ్రతతో మరోసారి భూకంపం రాగా.. ఈశాన్య భారత్, బంగ్లాదేశ్, చైనా వరకూ భూమి కంపించిందని వెల్లడించింది.

ఆదివారం సైతం 5.1 తీవ్రతతో మళ్లీ భూమి కంపించినట్టు తెలిపింది. వరుస భూకంపాల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం గణనీయంగా పెరుగుతోందని పేర్కొంది. కాగా, మయన్మార్ లో కొన్నేండ్లుగా మిలిటరీ ప్రభుత్వం(జుంటా), డెమోక్రసీ ఫైటర్స్, గిరిజన తెగల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో దేశం సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పుడు భారీ భూకంపం రావడం, రోడ్లు, బ్రిడ్జిలు ధ్వసం కావడంతోపాటు కమ్యూనికేషన్లు, కరెంట్ కట్ కావడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది.

టోంగా సమీపంలో భారీ భూకంపం..
కాన్ బెర్రా: ఆస్ట్రేలియాకు తూర్పు దిక్కున ఉన్న టోంగా ఐల్యాండ్ కంట్రీ సమీపంలో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున (ఈ నెల 31వ తేదీ) టోంగా మెయిన్ ఐల్యాండ్ కు ఈశాన్య దిక్కున 100 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్టు యూఎస్ జియాలజికల్ సర్వే (యూఎస్ జీఎస్) ప్రకటించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.1గా నమోదైనట్టు వెల్లడించింది.

భూకంప కేంద్రం మాత్రం చాలా లోతులో ఏర్పడినట్టు పేర్కొంది. భూకంప కేంద్రానికి 300 కిలోమీర్ల పరిధిలో సముద్రపు అలలు పోటెత్తి సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం అందలేదని ఈ మేరకు ‘కాన్ బెర్రా టైమ్స్’ పత్రిక వెల్లడించింది. కాగా, పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియాకు తూర్పు దిక్కున 3,500 కిలోమీటర్ల దూరంలో టోంగా దేశం ఉంది. మొత్తం 171 దీవులతో కూడిన ఈ దేశంలో లక్ష మంది జనాభా నివసిస్తున్నారు.ఠ

మృత్యువు విలయతాండవం..
మాండలే సిటీలో ఎటు చూసినా మృత్యువు విలయతాండవం చేసినట్టుగా కనిపిస్తోంది. శిథిలాలను తొలగించిన కొద్దీ మృతదేహాలు బయటపడుతు న్నాయి. మయన్మార్​లో భూకంపం ధాటికి దాదాపు 2,900 భవనాలు కూలిపోయాయి. 30 ప్రధాన రోడ్లు, 7 పెద్ద బ్రిడ్జిలు ధ్వంసమయ్యాయని తెలుస్తోంది. నేపిడాతోపాటు మాండలేలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు మూసివేశారు. మయన్మార్​లో సహాయక చర్యల కోసం భారత్ ‘ఆపరేషన్ బ్రహ్మ’ పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టింది. 8‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 మంది ఎన్డీఆర్ఎఫ్, మిలిటరీ హాస్పిటల్స్ సిబ్బందిని పంపింది.