
చిన్నశంకరంపేట, వెలుగు: ఆస్తులు వెనుకేసుకోవడానికి కాదు.. ప్రజల కోసం పనిచేసేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని మైనంపల్లి రోహిత్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనంలో తండ్రి మైనంపల్లి హనుమంతరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో కేవలం రూ. 50 వేల రూపాయలకే ఎకరం భూమి ఉండేదని, కేవలం ప్రజాసేవే మార్గంగా ఎంచుకొని సేవలందించాడే తప్ప ఆస్తుల మీద వ్యామోహంతో కాదన్నారు.
మెదక్ నియోజకవర్గంలో కేవలం కొబ్బరికాయలు కొట్టి, అభివృద్ధిని మొత్తం సిద్దిపేటకు తరలించుకుపోతున్న మంత్రి హరీశ్ రావు బాగోతం అందరికీ తెలిసిందే అన్నారు. రాబోయే ఎన్నికలు సిద్దిపేట పెత్తందారి తనానికి, మెదక్ ఆత్మగౌరవానికి జరిగే పోటీగా భావించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ.. తమకు మద్దతు తెలిపిన నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు.
ఎన్ని అక్రమ కేసులు పెట్టినా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. మెదక్‌కు రావాల్సిన 18 ఆఫీసులను తరలించడమే కాకుండా, ఇందిరాగాంధీ హయాంలో ఏర్పాటు చేసిన డివిజన్ పోస్ట్ ఆఫీస్ సైతం తరలించేందుకు ప్రయత్నిస్తున్న మంత్రి హరీశ్‌రావు వైఖరిని ప్రజలు గమనించాలన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పార్టీని గెలిపించి, కల్లబొళ్లి మాటలు చెప్పే కారు పార్టీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుప్రభాత్ రావు, గంగా నరేందర్, రాజిరెడ్డి, గోపాల్‌రెడ్డి, ప్రభాకర్, జీవన్ రావు, హఫీజొద్దీన్ పాల్గొన్నారు.