ఆ గుళ్లో కొబ్బరికాయ కట్టండి.. సమస్యలను దూరం చేసుకోండి

ఆంజనేయుడు లేని గ్రామం అంటూ ఉండదు.మనం ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లిన అక్కడ మనకు ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనమిస్తుంది. ఆంజనేయుడిని ధైర్యానికి బలానికి ప్రతీకగా భావిస్తారు.అంతేకాకుండా భక్తికి, బ్రహ్మచర్యానికి కూడా ఆంజనేయ స్వామి ప్రతీక అని చెప్పవచ్చు.ఆంజనేయ స్వామి విగ్రహం అనగానే మనకు రాముడి పాదాలచెంత భక్తితో నమస్కరిస్తూ ఉన్నటువంటి రూపం, లేదా సంజీవిని పర్వతాన్ని చేతిలో పెట్టుకొని గాలిలో పయనిస్తున్న చిత్రం గుర్తుకు వస్తుంది.  కాని మైసూరులోని ఆంజనేయ స్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది.   ఏదైనా  పరిష్కారం కాని సమస్యఉంటే  మైసూరు లోని కార్యసిద్ది ఆంజనేయ స్వామిని దర్శిస్తే ఎలాంటి సమస్య అయినా పరిష్కారమవుతుందని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.  

మైసూర్‌లోని కార్యసిద్ధి  ఆంజనేయుడి దర్శనం కోసం  వచ్చేవారు  పాతాళ ఆంజనేయుడిని దర్శించి, కొబ్బరికాయలు సమర్పించి ప్రార్థిస్తారు. మైసూర్‌లోని కార్యసిద్ధి ఆంజనేయ ఆలయం 2012లో  ప్రతిష్టించారు.   ఈ ఆలయం  ఆకర్షణీయమైన హనుమాన్ దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం వద్ద మైసూర్-ఊటీ రహదారికి సమీపంలో ఉన్న ఈ ఆలయంలోని ఆంజనేయుడిని   కార్యసిద్ధి ఆంజనేయుడిగా పూజిస్తారు.  కార్యసిద్ది హనుమంతుడిని పూజించడానికి దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు.  ఆ ఆలయంలోని పూజారులకు ( పండిట్లకు)  కానుకలు ఇవ్వడం, అర్చన, అలంకార, పవమాన హోమం , మన్యు సూక్త అనుష్ఠానం వంటివాటిని నిర్వహిస్తుంటారు.  ముఖ్యంగా, పూర్ణ ఫల సమర్పణ సేవ భక్తులలో గణనీయమైన ప్రజాదరణను పొందింది.  ఈ పవిత్ర స్థల సందర్శన సానుకూల ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. 

ఈ ఆలయంలో ఆంజనేయ స్వామికి కొబ్బరికాయలు సమర్పించడం ఒక ప్రత్యేక సంప్రదాయం. దీర్ఘకాలికంగా సమస్యలతో బాధపడేవారు ఇక్కడ స్వామిని దర్శించి  ... ఆలయ ప్రాంగణంలో ఒక ప్రదేశంలో  కొబ్బరికాయలు కట్టి... 16 రోజుల తర్వాత వచ్చి...  కట్టిన కొబ్బరికాయలను దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.  దీనిని ప్రసాదంగా  ఇతరులకు పంచిపెడతారు.  పాతాళ ఆంజనేయ దర్శనానికి నామమాత్రపు రుసుము రూ. 10తో, వారంలో ప్రతిరోజు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామిని దర్శనం చేసుకోవచ్చని ఆలయ నిర్వాహకులు తెలిపారు.  కార్యసిద్ధి హనుమాన్ విగ్రహం  200 టన్నుల బరువున్న ఏకశిలా ఆంజనేయ శిల్పంతో ఉంటుంది.  ఈవిగ్రహాన్ని శిల్పి సుబ్రమణ్య ఆర్చార్ నేతృత్వంలో  18 మంది శిల్పుల  బృందం 10 నెలల పాటు తయారు చేశారు.  ఈ  దేవాలయంలో స్వామివారిని దర్శించుకొనేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు తరలి వస్తుంటారు.  ఈ దేవాలయాన్ని దర్శిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని భక్తులు నమ్ముతుంటారు.