- నెలన్నరలో 15 మంది మృత్యువాత
- దర్యాప్తునకు స్పెషల్ టీమ్ ఏర్పాటు
జమ్మూ: జమ్మూలోని రాజౌరీ జిల్లాలో అంతుచిక్కని మరణాలు కలవరపెడుతున్నాయి. బుధాల్ గ్రామంలో అనుమానాస్పద రీతిలో గడిచిన 45 రోజుల్లోనే 15 మంది చనిపోయారు. డాక్టర్లకు కూడా అర్థంకాని జబ్బులతో తోటివాళ్లు చనిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఆస్పత్రిలో చేరిన మరో చిన్నారి పరిస్థితి సీరియస్‌గా ఉందని డాక్టర్లు వెల్లడించారు. పుణెలోని వైరాలజీ ఇన్స్టిట్యూట్, ఢిల్లీలోని డిసీజ్ కంట్రోల్ సెంటర్ సహా మరో మూడు ల్యాబ్‌లలో నమూనాలు టెస్ట్ చేయగా ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు సోకలేదని తేలిందని డాక్టర్లు చెప్పారు. దీంతో ఈ మిస్టరీ మరణాలపై దర్యాప్తునకు ప్రభుత్వం 11 మందితో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసిందని జిల్లా అధికారులు తెలిపారు.
బంతి భోజనమే బెడిసికొట్టిందా?
బుధాల్ గ్రామంలో గత నెల 7న జరిగిన ఓ కార్యక్రమంలో బంతి భోజనం పెట్టారు. అక్కడ తిన్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురై అందులో ఐదుగురు చనియారు. ఆ తర్వాత అదే నెల 12న జరిగిన మరో కమ్యూనిటీ భోజనం తర్వాత 9 మంది కుటుంబసభ్యుల్లో ముగ్గురు మృతి చెందారు. జనవరి 12న జరిగిన మరో భోజన కార్యక్రమం అనంతరం 10 మంది అస్వస్థతకు గురయ్యారు.
అందులో ఆరుగురు చిన్నారులున్నారు. వీరిలో బుధవారం రాత్రి ఓ చిన్నారి చనిపోగా 15 ఏండ్ల బాలుడి పరిస్థితి సీరియస్‌గా ఉంది. మొదటి ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, డాక్టర్ల బృందాన్ని స్పాట్‌కు పంపించింది. వాళ్లు అక్కడి నీటి నమూనాలను, ఫుడ్ క్వాలిటీని టెస్ట్ చేశారు. గ్రామస్తులందరికీ మెడికల్ టెస్టులు నిర్వహించారు. అయితే, ఈ మరణాలపై ఇప్పటివరకు క్లారిటీ రాకపోవడంతో బుధాల్ గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.