
ప్రపంచానికి మరో వైరస్ ముప్పు పొంచి ఉంది. అంతుచిక్కని ఈ వైరస్ జనం ప్రాణాలను తీసేస్తోంది. వైరస్ లక్షణాలు కనిపించిన 48 గంటల్లోనే.. అంటే రెండు రోజుల్లోనే చనిపోతున్నారు జనం. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో.. కాంగో దేశంలో ఇప్పుడు ఈ వైరస్ విజృంభణ కలకలం రేపుతోంది. ఇప్పటికే 53 మంది చనిపోయినట్లు కాంగో దేశం ప్రకటించగా.. ఈ వైరస్ ప్రజారోగ్యానికి ఒక ముఖ్యమైన ముప్పు.. అప్రమత్తం కావాలి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ.. WHO సైతం ప్రకటించటం మిగతా దేశాలను కలవరపాటుకు గురి చేస్తోంది.
ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి ఎంతలా గడగడలాడించిందో ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు. కొవిడ్ వైరస్ ధాటికి ప్రపంచ వ్యాప్తంగా లక్షల మరణాలు సంభవించాయి. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని స్తంభింపజేసింది. కరోనా వైరస్ పేరు గుర్తు చేస్తే ఇప్పటికి కొందరు ఒళ్లు జంకుతుందంటే ఈ వైరస్ మానవాళిపై ఏ విధమైన ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. కరోనా దెబ్బకు వైరస్ అంటనే జనంలో ఒక రకమైన భయం క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలో ప్రపంచదేశాలకు మరో వైరస్ ముప్పు పొంచి ఉంది.
రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో గుర్తు తెలియని వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ వైరస్ సోకి ఇప్పటికే 50 మందికి పైగా చనిపోయినట్లు కాంగో ప్రభుత్వం వెల్లడించింది. వందల సంఖ్యలో ప్రజలు ఈ వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. ఈ వైరస్ సోకిన 48 గంటల్లోనే మరణాలు సంభవిస్తున్నట్లు కాంగో అధికారులు తెలపడంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. ఈ వింత వ్యాధి ఏంటన్నది అంతు చిక్కకపోవడంతో పరిశోధకులు తలలు పట్టుకుంటున్నారు. కాంగోలో వ్యాప్తి చెందుతోన్న ఈ వైరస్‌పై వర్డల్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) ఫోకస్ పెట్టింది. గుర్తు తెలియని ఈ వైరస్ వ్యాప్తిని డబ్ల్యూహెచ్వో ప్రజారోగ్యానికి ఒక ముఖ్యమైన ముప్పు అని హెచ్చరించింది.
డబ్ల్యూహెచ్ ప్రకారం.. కాంగోలో విజృంభిస్తోన్న ఈ వింత వ్యాధికి ఖచ్చితమైన కారణం ఏంటన్న ఇంకా తెలియలేదు. ఈ వ్యాధి మొదట 2025, జనవరిలో ఈక్వేటర్ ప్రావిన్స్‌లోని బోలోకో గ్రామంలో గుర్తించబడింది. ఫిబ్రవరి 9న ఈక్వేటర్ ప్రావిన్స్‌లోని బోమాటే గ్రామంలో రెండో కేసు నమోదు అయ్యింది. బోలోకోలో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ముగ్గురు పిల్లలు ఈ వ్యాధి సోకి మరణించారు. పరిశోధకుల ప్రాథమిక దర్యాప్తులో చనిపోయిన పిల్లల్లో అలసట, విరేచనాలు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయని తేలింది.
అలాగే.. రక్తస్రావం సంకేతాలు, ఎపిస్టాక్సిస్, హెమటెమిసిస్ వంటి లక్షణాలు కూడా కనిపించి చివరకు మరణాలు సంభవించాయని గుర్తించారు. మృతి చెందిన పిల్లలు మరణానికి ముందు గబ్బిలం మాంసం తిన్నట్లు గుర్తించామని.. దీని ద్వారానే ఈ వింత వ్యాధి సోకొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. ఈ వ్యాధికి సంబంధించి ఫిబ్రవరి 15 నాటికి మొత్తం 431 కేసులు నమోదు కాగా.. 53 మరణాలు సంభవించాయి.
ఈ వ్యాధి బారిన పడిన వారి నుంచి తీసుకున్న నమూనాలలో ఏవీ ఎబోలా వైరస్ లేదా మార్బర్గ్ వంటి సాధారణ రక్తస్రావ జ్వర వ్యాధులకు పాజిటివ్‌గా తేలలేదు. కొన్ని శాంపిల్స్‌లో మాత్రం మలేరియా పాజిటివ్‌గా గుర్తించబడినట్లు అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. వ్యాధి తీవ్రత, మరణాల ఆధారంగా డబ్ల్యూహెచ్వో ఈ గుర్తు తెలియని వ్యాధిని ప్రజారోగ్యానికి గణనీయమైన ముప్పుగా హెచ్చరించింది.
ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తుండటం.. వైరస్ సోకిన 48 గంటల్లోనే మరణాలు సంభవించడంతో డబ్ల్యూహెచ్వో ఆందోళన వ్యక్తం చేసింది. కాంగోలో సరైన వైద్య వనరులు లేకపోవడం, ప్రభావిత ప్రాంతాల మారుమూల ప్రాంతం కావడంతో పాటు దేశంలో జరుగుతోన్న ఘర్షణల వల్ల ఈ వ్యాధి మరింత విస్తరించి ప్రజల ఆరోగ్యాన్ని మరింత తీవ్రతరం చేస్తోందని డబ్ల్యూహెచ్వో తెలిపింది.
ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలు:
తలనొప్పి, శరీర నొప్పులు, జ్వరం, చలి, దగ్గు, వాంతులు, మైయాల్జియా, చెమటలు పట్టడం, ముక్కు కారటం, మెడ దృఢత్వం, విరేచనాలు, కడుపు నొప్పి.