మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామంలోని ఇల్లు దగ్ధమై ఆరుగురు సజీవ దహనమైన ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి గురైన ఇంటికి కొద్ది దూరంలో రెండు క్యాన్లు కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. గంటన్నర సమయంలోనే ఇల్లు మొత్తం కాలి బూడిదవగా..మంటలు ఒకేసారి ఎలా వ్యాప్తి చెందాయనే దానిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై విచారణ చేపట్టాలని పోలీసులకు శివయ్య కుమారుడు ఫిర్యాదు చేశారు. అతడు ప్రేమ వివాహం చేసుకుని తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడని తెలుస్తోంది.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామంలో ఇల్లు దగ్ధం కావడంతో ఆ మంటల్లో చిక్కుకొని ఆరుగురు సజీవ దహనమయ్యారు. చనిపోయిన వారిలో మాసు శివయ్య (50), ఆయన భార్య రాజ్యలక్ష్మి, శివయ్య వదిన కూతురు మౌనిక (35), హిమబిందు (4), స్వీటి (2), శాంతయ్య (సింగరేణి కార్మికుడు, మృతుడి బంధువు) ఉన్నారు.
సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పివేశాయి. ఈ ప్రమాదం షాట్ సర్క్యూట్ వల్ల కాలేదని విద్యుత్ శాఖ అధికారులు తేల్చి చెప్పారు. ఆ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా పేలలేదని అధికారులు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ తిరుపతి రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు.
రిపోర్ట్స్ రావాల్సి ఉంది...
శివయ్య కుటుంబ సభ్యుల మరణంపై అన్నీ కోణాల్లోనూ విచారణ చేస్తున్నామని డీసీపీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. ఫైర్, ట్రాన్స్ కో రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. కొంతమంది అనుమానితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 16 టీంలను ఏర్పాటు చేసి ఇన్వెస్టిగెషన్ చేస్తున్నామని తెలిపారు. శాంతయ్య కుటుంబ సభ్యులను కూడా విచారణ చేస్తున్నామన్నారు.