వీడిన జంట హత్య కేసు మిస్టరీ

వివాహేతర సంబంధమే హత్యకు కారణం
నలుగురిపై కేసు నమోదు, ప్రధాన నిందితుడి అరెస్టు

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: జిల్లాలో ఇటీవల జరిగిన జంట హత్య కేసుల మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని నిర్ధారించారు. మంగళవారం ఎస్పీ డి.ఉదయ్​కుమార్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కేఆర్​కే కాలనీకి చెందిన సొంకంటే అశ్వినికి 12 సంవత్సరాల క్రితం సుందరయ్య కాలనీకి చెందిన సౌకాంబ్లే రమేశ్​తో వివాహం జరిగింది. వారికి 8 సంవత్సరాల కుమారుడు, 4  సంవత్సరాల కుమార్తె ఉన్నారు.  మూడు నెలల నుంచి అశ్విని పట్టణంలోని భుక్తాపూర్​కు చెందిన ఎమ్​డి.రెహమాన్​ తో సన్నిహితంగా ఉంటోంది. గత నెల 28న రమేశ్​ తన భార్య అశ్విని కోసం కేఆర్​కే కాలనీకి వెళ్లగా అక్కడ లేకపోవడంతో కుమారుడిని తీసుకొని భార్యను వెతకడానికి వెళ్లారు.

వారిద్దరు  గతంలో గుడిహత్నూర్​ మండలం సీతాగోంది అటవీ ప్రాంతంలో  కలుసుకున్న చోటును కుమారుడు చూపించగా అక్కడే అశ్విని , రెహమన్​ కనిపించారు. దీంతో ఆగ్రహానికి గురైన రమేశ్​ రెహమాన్​ తలపై కర్రతో  దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అశ్వినిని రమేశ్​ చెల్లెల్లు స్వప్న, శీల, బావ వెంకటేశ్​ పట్టుకోగా రమేశ్​కర్రతో ఆమె నుదిటిపై కొట్టడంతో చనిపోయింది. ప్రధాన నిందితుడు రమేశ్​ను అరెస్టు చేసి, సహకరించిన నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో ఉట్నూర్ డీఎస్పీ సీహెచ్. నాగేందర్ సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.