మిస్టరీ : లంబీ డెహర్‌‌లో ఏం జరిగింది?

మిస్టరీ : లంబీ డెహర్‌‌లో ఏం జరిగింది?

అక్కడ అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ.. ఆ ప్రాంతంలో కొన్ని వేల మంది ప్రాణాలు పోయాయని చెప్తుంటారు! కారణం ఏదైనా.. అక్కడ దెయ్యాలు తిరుగుతాయని చాలామంది నమ్ముతున్నారు. అంతేకాదు.. అక్కడ రకరకాల అరుపులు, శబ్ధాలు విన్నామని చెప్తున్నారు. అందుకే చీకటి పడ్డాక ఆ వైపు వెళ్లాలంటేనే వణికిపోతుంటారు జనాలు. 

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ముస్సోరీ రేంజ్‌ ఉన్న ఖనిజి నగర్​‌కు దగ్గర్లో లంబీ డెహర్‌ అనే గనులు ఉన్నాయి. ప్రస్తుతం వీటిని మూసేశారు. ఒకప్పుడు ఇక్కడ వేలమంది పనిచేసేవాళ్లు. నిత్యం సున్నపు రాయిని తవ్వి తీసేవాళ్లు. అలాంటి టైంలో ఒకరోజు ఓ మహిళ గని దగ్గరకు పరిగెత్తుతూ వెళ్లింది. కానీ.. గేటు దగ్గరే సెక్యూరిటీ వాళ్లు ఆమెని ఆపేశారు. అప్పుడామె ఏడుస్తూ.. ‘గని లోపల పెద్ద పేలుడు జరిగింది. ఆ పేలుడు వల్ల తన భర్త చనిపోయాడ’ని చెప్పింది. కానీ.. సెక్యూరిటీ వాళ్లు అలాంటిదేమీ జరగలేదని చెప్పారు.

అయినా వినకుండా తన భర్తను చూడాలని మొండిపట్టు పట్టింది. తనకు సాయం చేయమని అక్కడున్న వాళ్లందరినీ రిక్వెస్ట్‌ చేసింది. ఆమె కంగారు పడడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. పేలుడు జరగలేదని నమ్మించడానికి ఆమెని లోపలికి పంపేందుకు అనుమతించారు. వాస్తవానికి ఆమె వచ్చినప్పుడు అక్కడ ఎలాంటి పేలుడు జరగలేదు. కానీ.. ఆమె పేలుడు శబ్దం వినిపించినట్టు భ్రమ పడింది. అందుకే తన భర్త చనిపోయాడని కేకలు వేస్తూ హడావిడిగా వెళ్లింది. అక్కడి ఫోర్‌మెన్ ఆమెని లోపలికి తీసుకెళ్లాడు. సరిగ్గా తన భర్త ఉన్న గని దగ్గరకు వెళ్లగానే పెద్ద పేలుడు జరిగింది.

ఆ ప్రమాదంలో ఆ దంపతులతో పాటు ఫోర్‌మెన్‌ కూడా చనిపోయాడు. అంతలోనే ఆ గనిలో చాలా చోట్ల పేలుళ్లు జరిగాయి. అక్కడ పనిచేస్తున్న కార్మికుల కేకలు కొండలను కమ్మేశాయి. అక్కడ చనిపోయిన వాళ్లంతా అక్కడే దెయ్యాలుగా తిరుగుతున్నారు. ఇదంతా అక్కడ జరిగిందో, లేదో తెలియదు. కానీ.. అక్కడివాళ్లు చాలామంది ఇలాంటి కథలే చెప్తుంటారు. 

యాభై వేల మంది!

ప్రస్తుతం ఇండియాలోని అత్యంత హాంటెడ్ ప్రదేశాల్లో లంబీ డెహర్ ఒకటి. ఇక్కడ పనిచేస్తూ చనిపోయిన వాళ్ల ఆత్మలు ఇక్కడే తిరుగుతున్నాయని చాలామంది నమ్ముతుంటారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత ఈ ప్రాంతానికి వెళ్లాలంటేనే భయపడుతుంటారు. ఇక్కడివాళ్లు చెప్తున్న దాని ప్రకారం.. ఈ గనిలో1990ల్లో ఒక భారీ పేలుడు జరిగింది. అప్పుడు ఇక్కడ పనిచేస్తున్నవాళ్లలో సుమారు 50,000 మంది చనిపోయారు.

ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచేశారు. అయితే.. ఇలాంటి భయంకరమైన పేలుడు ఒకటి జరిగిందని గవర్నమెంట్‌ రికార్డుల్లో కూడా లేదు. కానీ.. చాలాసార్లు ఇక్కడ పారానార్మల్ సంఘటనలు జరిగినట్టు ఆ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. అంతేకాదు... చీకటి పడ్డాక ఆ ప్రాంతం నుంచి వింత ఏడుపులు, అరుపులు వినిపిస్తుంటాయని చాలామంది చెప్పారు. ఈ గనులకు దగ్గర్లో ఒక హెలికాప్టర్ కూడా క్రాష్ అయిందట! 

అసలేం జరిగింది? 

లంబీ డెహర్‌‌ గనుల గురించి చాలా కథనాలు వినిపిస్తుంటాయి. కానీ.. ఈ గని ఎప్పుడు మొదలైందో ఎవరికీ తెలియదు. అప్పట్లో ఉన్న అతిపెద్ద గనుల్లో ఇది ఒకటి. ఉత్తరప్రదేశ్ స్టేట్ ‘మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’ లంబీ డెహర్‌‌ గనులను పర్యవేక్షించేది. ఈ గనులు మొత్తం 97 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇక్కడ ఎక్కువశాతం ఎత్తయిన కొండలే కనిపిస్తుంటాయి. ఇవి హిమాలయాల్లోని ముస్సోరీ కొండ శ్రేణిలో భాగం. వీటిని డైనమైట్‌తో పేల్చి, సున్నపురాయిని తవ్వేవాళ్లు. అలా పేల్చినప్పుడు గనులు కూలిపోతుండేవి.

వాస్తవానికి ఇది చట్టవిరుద్ధమైన పద్ధతి. అయినా.. ఈ పద్ధతినే పాటించేవాళ్లు. దాంతో వృక్షసంపద నాశనమైంది. జంతువులు ఇబ్బంది పడ్డాయి. వ్యవసాయ భూములు, ఇండ్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ పేలుళ్లవల్ల ఇండ్లు, వ్యవసాయ భూములు నాశనమయ్యాయి. భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. అందుకే 1961లోనే అక్కడ మైనింగ్‌ని నిషేధించారు. 

కానీ.. కొన్ని కారణాల వల్ల మళ్లీ కొండలను తవ్వడం మొదలుపెట్టారు. ఎటువంటి సేఫ్టీ పద్ధతులు పాటించకుండానే 50 వేల మందికి పైగా కార్మికులు పనిచేసేవాళ్లు. అందుకే మైనింగ్ మొదలైన నాటి నుంచి ఇక్కడ పనిచేసేవాళ్లలో చాలామంది అనారోగ్యం బారినపడ్డారు. అందులో కొందరు చనిపోయారు. సేఫ్టీ ప్రొటోకాల్‌ లేకపోవడం వల్ల తెలియని రకరకాల వ్యాధులు వచ్చేవి.

కొందరు గుండెపోటుతో చనిపోయేవాళ్లు. ఇలా.. ఆ గనుల్లో ఎన్నో ప్రాణాలు పోయాయి. అందుకే 1996లో సుప్రీంకోర్టు గనులను మూసేయాలని తీర్పు ఇచ్చింది. అయితే.. ఆ గనుల్లో చనిపోయినవాళ్లంతా దెయ్యాలుగా మారారని, వాళ్ల ఆత్మలు అక్కడే తిరుగుతున్నాయని ఆ చుట్టుపక్కల ఉండేవాళ్లు ఇప్పటికీ చాలా బలంగా నమ్ముతున్నారు.