భారత మహిళా క్రికెటర్‍కు అరుదైన గైరవం.. మైసూరు రోడ్డు జంక్షన్‌కు ఆమె పేరు

భారత మహిళా క్రికెటర్‍కు అరుదైన గైరవం..  మైసూరు రోడ్డు జంక్షన్‌కు ఆమె పేరు

భారత మహిళా క్రికెటర్ మిన్ను మణికి అరుదైన గైరవం దక్కింది. పొలాల్లో క్రికెట్ ఆడటం నేర్చుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆమె ప్రయాణం మరింత మందిలో స్ఫూర్తి నింపాలనే ఉద్దేశ్యంతో ఏకంగా ఓ ప్రధాన కూడలికి ఆమె పేరు పెట్టారు. మైసూరు రోడ్డు జంక్షన్‌ను.. 'మిన్ను మణి జంక్షన్'గా మార్చినట్లు వయనాడ్ జిల్లా మనంతవాడి మునిసిపాలిటీ ప్రకటించింది. మనంతవాడి మునిసిపాలిటీ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

24 ఏళ్ల మిన్ను మణి.. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు పడగొట్టిన ఈ ఆఫ్ స్పిన్నర్.. టీ20 సిరీస్‌ను ఇండియా సొంతం చేసుకోవడంలో తన వంతు సహాయం చేసింది. ఓటమి తప్పదనుకున్న రెండో టీ20లో 95 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కాపాడుకోగలిగిందంటే.. అందులో మిన్ను పాత్రే ఎక్కువ. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ ఆఫ్ స్పిన్నర్.. కేవలం 9 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది.

ఇంటికి రహదారి లేదు

మనంతవాడిలోని మిన్ను మణి ఇంటికి సరైన రహదారి లేదు. బైకులు, కార్లు అటువైపుగా వెళ్లాలంటే సగం దూరం నడవల్సిందే. అలాంటిది ఒక ప్రధాన జంక్షన్‌కు ఆమె పేరు పెట్టడం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా జరిగిన క్రికెటర్ సన్మాన కార్యక్రమంలో మహిళా క్రికెటర్ ఇంటి దారిలో త్వరలోనే రోడ్డు నిర్మిస్తామని స్థానిక ఎమ్మెల్యే ఓఆర్ కేలు వెల్లడించారు.

అమ్మానాన్నలు రైతు కూలీలు

24 ఏండ్ల మిన్ను మణి.. కేరళలోని వయనాడ్ జిల్లా మనతవడి(చోయిమూల)కి చెందిన అమ్మాయి. తండ్రి సి.కె మణి ఒక దినసరి కూలీ. తల్లి వసంతదీ అదే బాట. పొలం పనులకు వెళ్లకపోతే రోజు గడవని పరిస్థితి. పదేండ్ల వయసు నుండే మిన్ను మణికి క్రికెట్ ఆడటం అలవాటు. నలుగురు నవ్వుతున్నా.. అవేమి పట్టింవీచుకోకుండా అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేది. ఆ పట్టుదలే ఆమెను నేడు ఈ స్థాయికి తీసుకొచ్చింది.