భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా యూనియన్లు పావులు కదుపుతున్నాయి. ఈనెల 27వ తేదీన సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ ఎం ఎస్, టీబీజీకేఎస్, సీఐటీయూ కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోని కార్మికులకు మందు, బిర్యానీ పొట్లాలతో పాటు గిఫ్టుల పంపిణీకి యూనియన్లు శ్రీకారం చుట్టాయి.
కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో ఓ జాతీయ కార్మిక సంఘం ఒక క్వార్టర్ బాటిల్ తో పాటు బిర్యానీ పొట్లం, రెండు స్టీల్ ప్లేట్లను ఆదివారం పంపిణీ చేసింది. కార్పొరేట్ ఏరియాలో పాగా వేసేందుకు అన్ని కార్మిక సంఘాలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో ఎన్నికలు ఉండడంతో కార్మికులను ఆకట్టుకునేందుకు యూనియన్ లీడర్లు పలు ప్రయాత్నాలు చేస్తున్నారు.