RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కు నిరసనగా మంగళవారం పలు విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మూడు డిమాండ్ల కోసం నబన్న అభిజన్ అనే పేరుతో కోల్ కతాలో ఈరోజు ర్యాలీ చేయనున్నారు. రవీంద్రభారతి యూనివర్సిటీకి చెందిన ఎంఏ విద్యార్థి ప్రబీర్ దాస్, కళ్యాణి యూనివర్శిటీకి చెందిన ఎంఏ బీఈడీ శుభాంకర్ హల్దర్, రవీంద్ర ముక్తా యూనివర్శిటీకి చెందిన సయన్ లాహిరి ల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు ర్యాలీలు ప్రారంభం కానున్నాయి.
పోలీసులకు అందిన ఇంటెలిజెన్స్ ప్రకారం.. భారీ భద్రత ఏర్పాటు చేశారు. ర్యాలీ జరిగే మార్గంలో 19 పాయింట్ల వద్ద బారికేడ్లు పెట్టారు. 6 వేల మంది పోలీసులు ర్యాలీ శాంతియుతంగా జరగడానికి మూడంచల భద్రత ఏర్పాటు చేశారు. కోల్‌కతా పోలీసులు మరియు హౌరా సిటీ పోలీసులతో పాటు, పోరాట బలగాలు, హెవీ రేడియో ఫ్లయింగ్ స్క్వాడ్‌లు (HRFS), ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), క్విక్ రియాక్షన్ టీమ్‌లు (QRT), వాటర్ కెనాన్ లు నిరసన సమయంలో ఏదైనా ఘర్షనలు ఏర్పడితే రెడీగా పెట్టుకున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి అదనపు బలగాలను కోల్‌కతాకు రప్పించారు. హేస్టింగ్స్, శిబ్‌పూర్ రోడ్, హౌరా బ్రిడ్జ్, హౌరా మైదాన్ వంటి కీలక అంశాలపై పోలీసులు దృష్టి సారించారు.
విద్యార్థుల మూడు డిమాండ్లు ఇవే..
- భాధితురాలు అభయకు న్యాయం జరగాలి.
- నిందితునికి ఉరిశిక్ష విధించాలి.
- ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలి.