ఎంట్రన్స్ లేకుండానే నాబార్డ్‎లో ఉద్యోగాలు.. సంవత్సరానికి రూ. 50-70 లక్షలు జీతం

ఎంట్రన్స్ లేకుండానే నాబార్డ్‎లో ఉద్యోగాలు.. సంవత్సరానికి రూ. 50-70 లక్షలు జీతం

నిరుద్యోగులకు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) గుడ్ న్యూస్ చెప్పింది. నాబార్డ్‎లో కాంట్రాక్ట్ స్పెషలిస్ట్‌ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసిన నాబార్డ్.. అర్హతలు, దరఖాస్తు తేదీలు, వేతనానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. నాబార్డ్ అధికారిక వెబ్‌సైట్ nabard.orgలో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అప్లికేషన్లకు చివరి తేదీ 2025, ఏప్రిల్ 6. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆ లోపు అప్లై చేసుకోవాలని సూచించింది.

దరఖాస్తు సమయంలో అభ్యర్థులు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని క్షుణ్ణంగా చదివి అప్లై చేసుకోవాలని పేర్కొంది. అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన తర్వాత ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తామని తెలిపింది. దరఖాస్తు సమయంలో సమర్పించిన సర్టిఫికేట్లలో ఏవైనా అవకతవకలు ఉంటే వారి అప్లికేషన్ తిరస్కరిస్తామని తేల్చి చెప్పింది నాబార్డ్. అలాగే.. ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉండదని.. అభ్యర్థుల పత్రాల పరిశీలన తర్వాత షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తామని తెలిపింది. 

అభ్యర్థులను వారి అర్హతలు, అనుభవం ఆధారంగా 1:3 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు నియామకానికి ముందు వైద్య పరీక్ష చేయించుకోవాలి. బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ ద్వారా వైద్యపరంగా ఫిట్‌గా ప్రకటించబడాలని సూచించింది. నియామక ప్రక్రియను సవరించే లేదా రద్దు చేసే హక్కు నాబార్డ్ కు ఉందని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల వివరాలను నాబార్డ్ అధికారిక సైట్లో వెల్లడిస్తామని తెలిపింది. 

ఖాళీల వివరాలు:

  • చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ (CISO): 01
  • వాతావరణ మార్పు నిపుణుడు - ఉపశమనం: 01
  • వాతావరణ మార్పు నిపుణుడు - అనుసరణ: 01
  • కంటెంట్ రైటర్: 01
  • గ్రాఫిక్ డిజైనర్: 01

వార్షిక వేతన వివరాలు:

  • CISO పోస్ట్ 1: శాలరీ రూ. 50-70 లక్షలు
  • వెదర్ ఛేంజ్ స్పెషలిస్ట్ పోస్టులు 2: శాలరీ రూ. 25-30 లక్షలు
  • కంటెంట్ రైటర్ 1: వేతనం రూ. 12 లక్షలు
  • గ్రాఫిక్ డిజైనర్ 1: శాలరీ రూ. 12 లక్షలు

కాంట్రాక్ట్ వ్యవధి

కాంట్రాక్ట్ వ్యవధి 2 సంవత్సరాలు. పని తీరు, అనుభవం చూసి 5 సంవత్సరాల వరకు పొడిగించే ఛాన్స్. ఉద్యోగం మానేసి ముందు ఒక నెల నోటీస్ పీరియడ్ చేయాల్సి ఉంటుంది.