నాబార్డు రుణ ప్రణాళిక రూ.3.85 లక్షల కోట్లు

నాబార్డు రుణ ప్రణాళిక రూ.3.85 లక్షల కోట్లు
  • వ్యవసాయానికి 1.62 లక్షల కోట్లు
  • 2025-26లో పంట రుణాల లక్ష్యం 87 వేల కోట్లు
  • సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 2.03 లక్షల కోట్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: నాబార్డు (జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు) 2025–26 ఆర్థిక సంవత్సరం కోసం రుణ ప్రణాళికను ఖరారు చేసింది. రూ.3.85 లక్షల కోట్లతో రూపొందించిన స్టేట్‌‌‌‌ ఫోకస్‌‌‌‌ పేపర్‌‌‌‌ను శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లో విడుదల చేసింది. గత ఏడాదికంటే రూ.లక్ష కోట్లు (37.80 శాతం)  అధికంగా కేటాయించింది. 

ఎంఎస్​ఎంఈలకు టాప్​ ప్రయారిటీ

అత్యధికంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఈ ఏడాదిలో రూ.2,03,565.36 కోట్ల రుణాలు ఇవ్వాలని నాబార్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత అగ్రికల్చర్ రంగానికి ప్రాధాన్యత కల్పించింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1,62,946.13 కోట్ల రుణాలు కేటాయింపులు చేశారు.

ఇందులో పంటలసాగు, ఉత్పత్తి, నిర్వహణ, మార్కెటింగ్‌‌‌‌ కోసం రైతులకు ఇచ్చే పంట రుణాలకు నాబార్డు రూ.87 వేల కోట్లు, టర్మ్​ లోన్లు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.69 వేల కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది.  వ్యవసాయ మౌలిక వసతుల కల్పనకు రూ.7 వేల కోట్లు ఇవ్వనున్నారు.

ఎక్స్‌‌‌‌పోర్టు క్రెడిట్‌‌‌‌కు రూ.611.20 కోట్లు, విద్యారంగానికి రూ.2,486.38 కోట్లు కేటాయింపులు చేసింది. విద్యారంగానికి గత ఏడాది కంటే కేటాయింపులు తగ్గించారు. హౌసింగ్​కు రూ.10,493.12 కోట్లు, రెన్యూవబుల్​ ఎనర్జీకి రూ.570.18 కోట్లు కేటాయించింది.  మొత్తంగా  నిరుటితో పోలిస్తే ఈ వార్షిక సంవత్సరంలో రుణాల లక్ష్యాన్ని నాబార్డు గణనీయంగా పెంచింది.

గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.82లక్షల కోట్లతో నాబార్డు రుణ ప్రణాళికను రూపొందించగా ఈ సారి రూ.లక్ష వేల కోట్లు అదనంగా కేటాయించింది. అదే క్రమంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు నిరుడు రూ.1.33 లక్షల కోట్ల రుణ కేటాయింపులు చేయగా, ఈ సారి రూ.1.62 లక్షల కోట్ల కేటాయించారు. ఎంఎస్​ఎంఈలకు గత ఏడాది రూ.1,29,636 కోట్ల ను కేటాయింపులు చేయగా ఈయేడాది రూ.2,03,565.36 కోట్లను కేటాయింపులు చేసింది.  

రుణ లక్ష్యం పెంపు

పంట రుణాల లక్ష్యాన్ని నాబార్డు ఏటికేడు పెంచుతూ పోతున్నది. రాష్ట్రంలో 70 లక్షల మందికిపైగా రైతులు ఉండగా... ఇందులో బ్యాంకులు, సహకార సంఘాల్లో రుణాలు తీసుకునే రైతులు సుమారు 35 లక్షల మందే ఉన్నారు. సాగుకు ఖర్చులు పెరిగిపోవడం, ప్రైవేటు వడ్డీభారం ఎక్కువ అవుతుండడం, ప్రభుత్వాలు రుణమాఫీ ప్రకటిస్తుండటంతో క్రమంగా బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకునే రైతుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది.

ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని నాబార్డు పంట రుణాల టార్గెట్‌‌‌‌, పంపిణీని కూడా క్రమంగా పెంచుతున్నది. 2020– 21 లో పంట రుణాలకు రూ. 53,223 కోట్లు కేటాయించగా, 2021=-22లో రూ. 59,440 కోట్లు, 2022=-23 లో రూ.67,864 కోట్లు, 2023=-24 లో రూ.73,438 కోట్లు కేటాయించింది. 2024=-25 సంవత్సరానికి రూ.81,478 కోట్లు కేటాయించగా 2024=25 సంవత్సరానికి 87,000కోట్లుగా  ప్రకటించింది.