
- డోపింగ్‌కు సహకరించాడన్న ఆరోపణలతో నాడా చర్యలు
- మరో ఇద్దరు కోచ్‌లు, ఏడుగురు అథ్లెట్లపైనా వేటు
న్యూఢిల్లీ: దేశ అథ్లెటిక్స్‌లో డోపింగ్ వ్యవహారం మరోసారి కలకలం సృష్టించింది. డోపింగ్‌కు సహకరించాడన్న ఆరోపణలతో ఇండియా జూనియర్ అథ్లెటిక్స్ చీఫ్ కోచ్‌గా పని చేస్తున్న తెలంగాణకు చెందిన నాగపురి రమేశ్‌పై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) సస్పెన్షన్ వేటు వేసింది. డోపింగ్‌కు సహకారం, నిషేధిత పదార్థాల వినియోగానికి సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించారంటూ మరో ఇద్దరు కోచ్‌లు కరమ్‌వీర్ సింగ్, రాకేశ్‌ను కూడా సస్పెండ్ చేసింది.
డోపింగ్ పరీక్షకు హాజరు కాకుండా తప్పించుకున్నారన్న కారణంతో ఏడుగురు అథ్లెట్లు పరాస్ సింఘాల్, పూజా రాణి, శణ్ముగ శ్రీనివాస్, చెలిమి ప్రత్యూష, శుభం మహారా, కిరణ్, జ్యోతిపైనా నాడా చర్యలు తీసుకుంది. ద్రోణాచార్య అవార్డీ అయిన కోచ్ రమేష్ హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సెంటర్ కేంద్రంగా పని చేస్తున్నాడు. ద్యుతీ చంద్, జీవాంజి దీప్తి వంటి స్టార్ అథ్లెట్లను తీర్చిదిద్ది మంచి పేరు తెచ్చుకున్నాడు.
2023లో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ) రమేశ్‌ను జూనియర్ చీఫ్ కోచ్‌గా నియమించింది. రమేశ్ తన గైడెన్స్ లో కోచింగ్ తీసుకుంటున్న ఇద్దరు అథ్లెట్లను డోపింగ్ అధికారుల పర్యవేక్షణ నుంచి తప్పించేందుకు సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాంతో నాడా నిబంధనల్లోని ఆర్టికల్ 2.9 ప్రకారం అతనిపై చర్యలు తీసుకున్నారు. కాగా, ఈ వ్యవహారాన్ని నాడా డీల్ చేస్తోందని చెబుతూ ఏఎఫ్‌ఐ అధికారులు స్పందించేందుకు నిరాకరిస్తున్నారు.
తప్పు చేయలేదు.. విచారణకు సిద్ధం: రమేశ్
నాడా సస్పెన్షన్ అంశంపై స్పందించిన రమేశ్ తాను ఎప్పుడూ ఎలాంటి తప్పుడు పనులు చేయలేదని, తప్పు చేసిన వారిని ప్రోత్సహించలేదని స్పష్టం చేశాడు. తెలంగాణ, ఏపీలోని ప్రతిభావంతులైన పేద క్రీడాకారులను తీర్చిదిద్దడానికే తన జీవితాన్ని దారపోశానని తెలిపాడు. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని తేల్చి చెప్పాడు.