Paris Olympics 2024: దిగ్గజాల మధ్య సమరం: నాదల్, జొకోవిచ్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?

Paris Olympics 2024: దిగ్గజాల మధ్య సమరం: నాదల్, జొకోవిచ్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?

ఒలింపిక్స్ లో బ్లాక్ బస్టర్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. టెన్నిస్ దిగ్గజ ఆటగాళ్లు రాఫెల్‌ నాదల్‌, నొవాక్‌ జొకోవిచ్‌ రెండో రౌండ్ లో అమీతుమీ తేల్చుకోనున్నారు. రెండు దశాబ్దాలుగా ఎన్నో థ్రిల్లింగ్ మ్యాచ్ ల్లో తలబడిన వీరిద్దరూ సోమవారం (జూలై 29) మరోసారి తమ ఆట తీరుతో అభిమానులను అలరించనున్నారు. ఇద్దరూ ఇప్పటివరకు ముఖాముఖిలో 59 సార్లు తలపడగా జొకోవిచ్ 30 సార్లు.. నాదల్ 29 సార్లు గెలిచారు. క్లే కోర్ట్ విషయానికి వస్తే నాదల్.. జోకోపై స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నాడు. 

రోలాండ్ గారోస్‌లో 10 సార్లు తలబడితే నాదల్ 8 సార్లు గెలిస్తే.. జొకోవిచ్ 2 మ్యాచ్ ల్లో విజయం సాధించాడు. సంవత్సరం పాటు టెన్నిస్ కు దూరంగా ఉన్న నాదల్ ఇటీవలే జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ లో తొలి రౌండ్ లో ఓడిపోయాడు. గాయాలతో సతమవుతున్న ఈ స్పెయిన్ స్టార్ ఈ మ్యాచ్ గెలవడం కష్టంగానే కనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో జొకోవిచ్ ఫేవరేట్ గా బరిలోకి దిగబోతున్నాడు. బహుశా వీరిద్దరి మధ్య జరగబోయే చివరి మ్యాచ్ ఇదే కావొచ్చు అని జొకోవిచ్ ఇటీవలే అభిప్రాయపడ్డాడు. దీంతో ఈ దిగ్గజాల సమరం చూడడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. 

పారిస్ ఒలిపిక్స్ మొదటి రౌండ్‌లో 83వ ర్యాంక్ మార్టన్ ఫుక్సోవిక్స్‌ను 6-1, 4-6, 6-4 తేడాతో నాదల్ ఓడించాడు. మరోవైపు జొకోవిచ్ వరుస సెట్లలో తొలి రౌండ్ గెలిచి రెండో రౌండ్ కు సిద్ధమయ్యాడు. ఈ మ్యాచ్ సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. స్పోర్ట్స్ 18.. 1 HD,SD ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. జియో సినిమా యాప్ తో పాటు వెబ్‌సైట్‌లోనూ లైవ్ చూడొచ్చు.