భద్రకాళి ఆలయంలో జేపీ నడ్డాకు పూర్ణ కుంభంతో స్వాగతం

వరంగల్ భద్రకాళి ఆలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ పూజారులు, అధికారులు జేపీ నడ్డాకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జేపీ నడ్డా వెంట తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు  లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి కూడా ఉన్నారు.

భద్రకాళి ఆలయంలో పూజలు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకటనారాయణ ఇంటికి జేపీ నడ్డాతో పాటు బండి సంజయ్, రాష్ట్ర నాయకులు వెళ్లారు. అక్కడ చాయ్ తాగి, రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. ఆ తర్వాత నేరుగా హన్మకొండలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు వెళ్లారు. బండి సంజయ్ నిర్వహించిన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర వరంగల్ లో ముగిసింది.

ఈ సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగసభలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. పాదయాత్రలో బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ కలిసి సంఘీభావం తెలిపారు. 30మంది NRI గ్రాడ్యుయేట్ విద్యార్థులు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఉదయం మామునూరు నుంచి మొదలైన పాదయాత్ర తిమ్మాపూర్ క్రాస్ రోడ్, నాయుడు పంప్ చౌరస్తా, రంగశాయిపేట, గవిచర్ల క్రాస్ రోడ్, శంభునిపేట, మిల్స్ బజార్ మీదుగా ఎంజీఎం జంక్షన్ చేరుకుంది. మధ్యాహ్నం భద్రకాళి ఆలయంలో పూజల తర్వాత పాదయాత్ర ముగింపు సభలో సంజయ్ పాల్గొంటారు. మరోవైపు.. నాలుగో విడత పాదయాత్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించే అవకాశం ఉంది. సమక్క సారలమ్మ నుంచి భద్రా చలం వరకు... పాదయాత్ర  ప్రకటించే అవకాశం ఉంది.