మంచిర్యాల, వెలుగు : దళిత బంధు స్కీం కింద బర్రెల కొనుగోళ్లలో అధికారులు, మధ్యవర్తులు కమీషన్లు దండుకుంటున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు. ఆంధ్రలోనే బర్రెలు కొనుగోలు చేయాలని లబ్ధిదారులను ఆఫీసర్లు ఒత్తిడి చేస్తున్నారని, అక్కడ రూ.50 వేల బర్రెను రూ.70 వేలకు కొంటున్నారని, మిగతా రూ.20వేలు ఎటుపోతున్నాయో అందరికీ తెలుసన్నారు.
శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జడ్పీ జనరల్ బాడీ మీటింగ్లో పాల్గొన్న ఆయన.. పశుసంవర్ధక శాఖపై చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. లబ్ధిదారులకు నచ్చిన చోట బర్రెలు కొనుగోలు చేసుకునే చాన్స్ ఇవ్వాలన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ.. దళితబంధు యూనిట్ల కింద ఎక్కువ మంది కార్లు, ట్రాక్టర్లు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తీసుకోవడానికే మొగ్గుచూపుతున్నారన్నారు. డెయిరీ, వ్యవసాయ అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.