కలర్​ లేదని .. సోయా రిటర్న్​

 కలర్​ లేదని .. సోయా రిటర్న్​
  • నాఫెడ్​ తీరుపై రైతుల ఆందోళన
  • క్వాలిటీ లేదంటూ సోయా  రిటర్న్​ 
  • కొనుగోలు సెంటర్లు నడుపుతున్న సింగిల్​ విండోలపై ఆర్థిక భారం 
  • కలెక్టర్​ను కలిసిన రైతులు

నిజామాబాద్, వెలుగు: సోయాబీన్​ పంట  కొనుగోలులో నాఫెడ్​ తీరు రైతులను నష్టాలకు గురిచేస్తోంది.  శాంపిల్స్​ ఒకే చేసి కొనుగోలు సెంటర్ల నుంచి సరుకు తెప్పించుకున్నాక కొర్రీలు పెట్టి వాపస్​ పంపుతోంది. దీంతో ట్రాన్స్​పోర్టు, హమాలీ  భారం సెంటర్ల నిర్వహిస్తున్న సింగిల్​ విండోలపై పడుతోంది. కమీషన్​ ఆశతో సోయా కొనుగోలు చేయకపోవడంతో అసలుకే ఎసరు వస్తోంది. రిజెక్ట్​ అయిన సోయా బహిరంగ మార్కెట్​లో అమ్ముదామనుకుంటే తక్కువ ధర​కు అడుగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

వడ్ల కాంటాలతో సోయా కొనుగోళ్లకు ఎఫెక్ట్​

ఈ ఖరీఫ్​లో నిజామాబాద్​​ జిల్లాలో 23 వేల ఎకరాల విస్తీర్ణంలో సోయాబీన్​ పంటను సాగుచేశారు. అందులో బోధన్, సాలూరా, కోటగిరి, రెంజల్​ మండలాల్లోనే 20 వేల ఎకరాలు ఉంది. ఆర్మూర్, బాల్కొండలో మూడు వేల ఎకరాలు పండించారు.   అక్టోబర్ లో కోతలు ముగిశాయి.  కేంద్ర ప్రభుత్వ​ఆధ్వర్యంలో నాఫెడ్​ నుంచి క్లియరెన్స్​ వచ్చాక మార్క్​ఫెడ్​ మధ్యవర్తిత్వంలో సింగిల్​ విండోలకు సోయా కొనుగోళ్ల బాధ్యత అప్పగించారు. క్వింటాల్​ సోయాబీన్​కు కేంద్రం రూ.4,892 మద్ధతు ధర ప్రకటించగా సింగిల్​ విండోలకు రూ.50 చొప్పున కమీషన్​ చెల్లిస్తుంది.

 నవంబర్​ లో ధాన్యం కొనుగోలు జరిగినందున  సోయా కాంటాలు పక్కన బెట్టి ఇప్పుడు మళ్లీ షురూ చేశారు. పంట సాగు చేసిన మండలాల్లో సింగిల్​ విండోలు కొనుగోలు కేంద్రాలను నడుపుతున్నాయి. సారంగాపూర్​లోని సీడబ్ల్యూసీ గోదాం ఇన్​చార్జ్​కు సోయా శాంపిళ్లు చూపించి, క్వాలిటీ ఆమోదం పొందారు. కాగా, ఇప్పుడు కాంటాలు పెట్టి సరుకు వెనక్కి పంపుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

మెషిన్​ కోతలు కారణం

వరి పంట తరహాలో రైతులు సోయాబీన్​ పంటను హార్వెస్టర్​లతో కోయించారు. ఆకు పసరు సోయా గింజలకు అంటుకొని కలర్​ తగ్గడంతో క్వాలిటీ లేదని కొన్ని రకాలను  తిప్పిపంపుతున్నారు.  కరిష్మా సీడ్​ దిగుబడి ఇతర రకాలతో పోలిస్తే కొంచెం తక్కువ​గా ఉంటుంది. ఓంకార్​ పరిస్థితి కాస్త ​అటూఇటుగా అంతే ఉంది. హార్వెస్టర్​ వాడకంతో కంటికి కలర్​ఫుల్​గా కనబడక రిజెక్ట్​ అవుతున్నాయి. అదే మిషన్​లతో కోసిన కేడీఎస్​, గ్రీన్​గోల్డ్​ రకం సోయా కలర్​ బాగుండడంతో దిగుమతి చేసుకుంటున్నారు.

సింగిల్​ విండోలకు లాస్​

కమీషన్​ ఆశతో సింగిల్​ విండోలు కొనుగోలు సెంటర్లు నడుపుతుండగా, రైతులు కాంటాలు పెడుతున్నారు. ​ లారీలు అన్​లోడ్​ అయితేనే రైతులకు బిల్లు, సంఘాలకు  కమీషన్​ అందుతుంది. అయితే లోడ్​ చేసి పంపిన వాటిలో  సుమారు 35 లారీల సరుకు బోధన్​, కోటగిరి, సాలూరాలో రిజెక్ట్​ కావడంతో హమాలీ, ట్రాన్స్​పోర్ట్​ భారం క్వింటాల్​కు రూ.70 చొప్పున ఇప్పుడు సింగిల్​ విండోలు మోయాల్సిన పరిస్థితి తలెత్తింది. 

50 కిలోల చొప్పున పంపిన బ్యాగ్​లు వారం తరువాత వాపస్​ వచ్చే టైంకు నాలుగైదు కిలోలు తగ్గడంతో రైతులకు నష్టం వాటిల్లుతోంది. దానికి తోడు ప్రైవేట్​ వ్యాపారులు రూ.4,100 కంటే చెల్లించమని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రైతులు సోమవారం కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

సైంటిఫిక్​ రీజన్​ లేదు: కేవలం కలర్​లేదని కారణం చూపి కాంటాపెట్టి పంపిన సోయాబిన్​ లారీలను వాపస్​ చేస్తున్నారు. ​ క్వాలిటీ చెక్​ శాస్త్రీయంగా చేయడంలేదు.  కమీషన్​ కోసం సెంటర్లు నడిపి నష్టపోతున్నాం. రైతులు కూడా లాస్​ అవుతున్నారు. గతంలో ఈ పరిస్థితి లేదు. కలెక్టర్​ చొరవ చూపితేనే గట్టుక్కుతాం.రవి, సింగిల్​ విండో చైర్మన్, మందర్నా