రాహుల్ ‘నఫ్రత్ కే భాయిజాన్’.. ‘మోదీకి మెమరీ లాస్’ ఉందనే వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

రాహుల్ ‘నఫ్రత్ కే భాయిజాన్’..  ‘మోదీకి మెమరీ లాస్’ ఉందనే వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్
  • ​ప్రధానిపై వ్యక్తిగత విమర్శలే.. మీ మొహబ్బత్ కా దుకాన్ అంటూ ఎద్దేవా

న్యూఢిల్లీ: అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ లాగా ప్రధాని నరేంద్ర మోదీ ‘మెమొరీ లాస్​’తో బాధపడుతున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. మీ ‘మొహబ్బత్ కా దుకాన్​’ అంటే మోదీపై వ్యక్తిగత విమర్శలేనా అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ప్రశ్నించారు. రాహుల్​ను ‘నఫ్రత్ కే భాయిజాన్’(ద్వేషపు సోదరుడు) అంటూ ఎద్దేవా చేశారు. ‘‘రాహుల్ గాంధీ మోదీజీపై వ్యక్తిగత విమర్శలు చేశారు.

రాజ్యాంగ పదవులను అవమానించడమే  నీ గుర్తింపా నఫ్రత్ కే భాయిజాన్ (రాహుల్​ ​గాందీ)? ఇదేనా నీ మొహబ్బత్ కీ దుకాన్అంటే” అని పూనావాలా నిలదీశారు. ‘‘మోదీని అన్ని రకాల మాటలంటున్నరు. ఆయన కులాన్ని, కుటుంబాన్ని, నిరాడంబరమైన నేపథ్యాన్ని టార్గెట్ చేస్తున్నరు. హిట్లర్‌‌‌‌ లాంటి చావు వస్తుందన్నారు. రావణుడితో పోల్చారు.. ఇలా ఎన్నో దుర్భాషలాడారు.

ఇప్పుడు వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఆయనపై ఎంత విషం చిమ్ముతున్నరో స్పష్టమవుతుంది”అని అన్నారు. వారు రాజవంశాలకు చెందినోళ్లు కనుక కుటుంబ పాలన సాగాలని కోరుకుంటున్నరని ఆరోపించారు. ఎన్నికల సంఘం, పలు రాజ్యాంగ వ్యవస్థలనే కాదు.. దేశ ప్రధానిని కూడా అవమానిస్తున్నరని తెలిపారు.