మాయాబజార్‌‌‌‌ స్ఫూర్తితో..

మాయాబజార్‌‌‌‌ స్ఫూర్తితో..

ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చిత్రాలతో దర్శకుడిగా మెప్పించిన  నాగ్ అశ్విన్.. మూడో సినిమాకే భారీ బడ్జెట్‌‌ సైన్స్ ఫిక్షన్‌‌ రూపొందించాడు.  ప్రభాస్‌‌, కమల్ హాసన్, అమితాబ్, దీపిక లాంటి స్టార్స్‌‌తో తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం  బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సందర్భంగా నాగ్ అశ్విన్ ఇలా ముచ్చటించాడు. 

‘‘ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్.  ఇది మొత్తం ఇండస్ట్రీ సక్సెస్‌‌గా భావిస్తున్నా.  ఇలాంటి సైన్స్ ఫిక్షన్ కథలు తీయాలనుకునే వారికి మా సినిమా విజయంతో ఒక డోర్ ఓపెన్ అయ్యింది. మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చిందని ఎంతోమంది విషెస్ చెబుతున్నారు. అలాంటి సినిమా అందించినందుకు ఆనందంగా ఉంది.  ‘కల్కి’ సినిమా చేయాలనే ఆలోచనకు స్ఫూర్తి ‘మాయాబజార్‌‌‌‌’ చిత్రం.  నిజంగా ఆ కథ మహాభారతంలో లేదు.  అదొక అడాప్టేషన్.. క్రియేటివ్ ఫిక్షన్. దాన్నుంచే ఈ సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది.

ఇక మూడో సినిమాకే ఇంత పెద్ద సినిమా అంటే కచ్చితంగా అది మా నిర్మాతల రిస్కే. ప్రభాస్ గారికి ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యారు. ఈ సినిమాను చాలా నమ్మారు. చాలా పెద్ద సినిమా చేస్తున్నారని ప్రారంభం నుంచి ఆయన ఎంకరేజ్ చేశారు.  కల్కి మ్యాసీవ్ సబ్జెక్ట్. ఇందులోని మూడు ప్రపంచాలను, అందులోని పాత్రలను ఫస్ట్ పార్ట్‌‌లో పరిచయం చేయాలి. అందుకే ప్రభాస్ గారి పాత్ర స్క్రీన్ టైం తక్కువ అనిపించొచ్చు.  ఎవరి పాత్రలు, పవర్స్, మోటివ్స్ ఏమిటో తెలిసింది. ఇకపై ఇంకా ఫన్ గా ఉంటుంది. పార్ట్‌‌ 2కి సంబంధించి 20 రోజులు షూట్ చేశాం. చాలా యాక్షన్, బ్యాక్ స్టోరీస్, న్యూ వరల్డ్స్ లాంటివన్నీ ఇప్పుడు క్రియేట్ చేయాలి. క్యామియోలు నాకు ఇష్టం. 

మనకి తెలిసి ఒక స్టార్‌‌‌‌ని సడన్‌‌గా చూసినప్పుడు ఒక ఎక్సయిట్‌‌మెంట్ వస్తుంది. అందుకే అన్ని క్యామియోలు.  కమల్ హాసన్‌‌ గారి పాత్రలో శ్రీశ్రీ కవిత్వం చెప్పించడానికి కారణం..  యస్కిన్‌‌ ఫిలాసఫీ కూడా అలాగే ఉంటుంది.  సెట్స్‌‌ని తీర్చిదిద్దడానికి మా ప్రొడక్షన్ టీం చాలా కష్టపడింది. బుజ్జిని డిజైన్ చేయడానికి ఏకంగా అటోమొబైల్ ఇంజనీరింగే చేశాం. బుజ్జికి పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నాం. టెంపరరీ లైసెన్స్ కూడా ఇచ్చారు. ఇక పూర్తిగా మహాభారతాన్ని తెరకెక్కించే ఆలోచన ఇప్పటికైతే నాకు లేదు”