అక్కినేని నాగ చైతన్య, సహజ నటి సాయి పల్లవి జంటగా నటించిన మూవీ తండేల్ (నాయకుడు అని అర్ధం). దేశభక్తికి, ప్రేమకథను జోడించి దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాను రూపొందించారు. కార్తీక్ తీడ కథను అందించారు. ఈ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 7న) ప్రపంచవ్యాపంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు గీతా ఆర్ట్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించారు. నాగచైతన్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో వచ్చిన తండేల్ ఎలా ఉంది? నాగచైతన్య, సాయిపల్లవి జోడి మెప్పించారా? పాకిస్తాన్ జైల్లో మన మత్స్యకారుల పోరాటం ఎలా చేశారనేది ఫుల్ రివ్యూలో చూద్దాం.
కథేంటంటే:
శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల మత్స్యలేశం గ్రామం. ఆ గ్రామంలో రాజు (నాగచైతన్య), సత్య (సాయిపల్లవి) చిన్ననాటి నుంచి కలిసి పెరుగుతారు. సత్యని చిన్నప్పటి నుంచి బుజ్జి తల్లి అని ప్రేమగా పిలుస్తాడు రాజు. స్నేహంతో మొదలైన వారి జర్నీ ప్రేమగా మారుతుంది. అలా ఒకరికొకరు ప్రాణంగా బతుకుతుంటారు. తండేల్ అంటే ముందుకు నడిపే నాయకుడని తన తండ్రిని చూసి అర్ధం చేసుకుంటాడు. అలా రాజు తండ్రి తండేల్ కావడంతో ఆ నాయకత్వ లక్షణాలన్నీ చిన్నతనంలోనే అలవరుచుకుంటాడు. రాజు వారసత్వంగా వచ్చిన మత్స్యకార వృత్తిలోనే జీవనం కొనసాగిస్తాడు.
ఇక చేపల వేట కోసం ఏడాదిలో తొమ్మిది నెలలు సముద్రంలో గడిపే రాజు ఎప్పుడెప్పుడు తిరిగొస్తాడా? అని బుజ్జితల్లి సముద్ర తీరం వైపు చూస్తూనే ఉంటుంది. ఈసారి రాజు వచ్చాక పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంది. అలా రాజు వచ్చాకా ఈ సారి వేటకు పోయేది లేదని వారిస్తుంది. కానీ, సత్య మాటలు వినకుండా రాజు సముద్రంలోకి వేటకు బయలు దేరుతాడు. అలా మత్స్యలేశం గ్రామం నుండి 22 మంది మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి చేపల వేటకు దిగి అనుకోకుండా సముద్రంలో పాకిస్థాన్ హద్దులకు వెళతారు.
అక్కడ పాక్ సైన్యానికి అనుకోకుండా పట్టుబడుతారు. ఆ తర్వాత ఏమైంది? చేపల వేటకు వెళ్లిన రాజు పాకిస్థాన్ కోస్ట్ గార్డ్స్‌కు ఎలా దొరికిపోయాడు? పాకిస్థాన్ జైలులో ఎలాంటి చిత్ర హింసలు అనుభవించారు? అక్కడ రాజుకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? ఈ 22 మంది మళ్లీ భారత్‍కు చేరరా లేదా? రాజుపై కోపంతో అతడిని కాదని మరొకరితో సత్య పెళ్లికి ఎందుకు సిద్ధపడింది? చివరికి రాజు, సత్య కలుసుకున్నారా? అదే సమయంలో పాకిస్థాన్ లో ఎందుకు అల్లర్లు చెలరేగాయి? వంటి తదితర విషయాలకు సమాధానాలు తెలియాలంటే తండేల్ సినిమాను థియేటర్లో చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
తండేల్ నిజజీవిత కథ కావడంతో.. ముందుగానే సినిమా ప్రధాన స్టోరీ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. 2018లో శ్రీకాకుళానికి చెందిన మత్య్సకారులు గుజరాత్‍లో చేపల వేటకు దిగి అనుకోకుండా సముద్రంలో పాకిస్థాన్ హద్దులకు వెళ్లడం, అక్కడ పాక్ సైన్యానికి పట్టుబడడం, పాక్ జైలులో కొన్ని నెలల పాటు చిత్ర హింసలు అనుభవించడం ఇవన్నీ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి.
దర్శకుడు చందు మత్స్యకారుల జీవితంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలను తీసుకొని.. వాటికి ప్రేమను, కొన్ని ఫిక్షనల్ అంశాలను జోడించి కథను రాసుకోవడం బాగుంది. ముఖ్యంగా రాజు-సత్య మధ్య హృద్యమైన ప్రేమని ముడిపెడుతూ దేశభక్తిని చెప్పడం అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ప్రేక్షకుల కళ్ళలో నీళ్లు తెప్పిస్తుంటుంది. కార్తీక్ తీడ అందించిన కథకు చందు మొండేటి జోడించిన అంశాలు ప్రేక్షకుడిని మరింత ఆలోచింపజేస్తాయి.
ALSO READ | మెగా ట్రోలింగ్: మరోసారి తెరపైకి మెగా వర్సెస్ అల్లు వివాదం.. అల్లు అరవింద్ జస్ట్ 'నో కామెంట్స్'
చేపలు పట్టడానికి వెళ్లిన వారి పరిస్థితి, నెలలు తరబడి సముద్రంలోనే ఉంటూ వారు పడే బాధలను కళ్ళకి కట్టినట్లుగా చూపించాడు. ఇంటి ఇల్లాలాది ప్రేమను వదిలేసి వెళ్లి.. తిరిగి రావడానికి వారు పడే శ్రమను, తమవారిని తలుచుకుని లోపల పడే భాధను బాగా చూపించాడు.
ఫస్టాఫ్ లో సముద్ర నేపథ్యం, రాజు, సత్యల మధ్యన ఉన్న ప్రేమ, వారి మధ్య విరహం, ఒకరి కోసం మరొకరు పరితపించే లవ్ సీన్స్ ఆడియన్స్ ను కథలో లీనం చేస్తాయి. హైలెస్సా, బుజ్జితల్లి పాటలతోపాటు, వచ్చే ఫైట్ సీన్ మెప్పిస్తాయి. ఈ క్రమంలో సత్య మాట లెక్క వినకుండా రాజు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లడంతో సినిమాలో మరింత ఎమోషన్ కూడుకుంటుంది. ఆ తర్వాత ప్రియురాలికి దూరమై రాజు పడే సంఘర్షణ, మరోవైపు సత్య విరహ వేదనను, ఎదురుచూపులను పొయేటిక్‌గా చందు చక్కగా చూపించారు.
అలాగే సముద్ర వేటకు బయలుదేరిన 22 మంది మత్స్య కారులు పాకిస్థాన్ లో చెరలో చిక్కిపోవడం, వారిని విడిపించడం కోసం సత్య ఢిల్లీ వెళ్లడం వంటి అంశాలతో సెకండాఫ్ ఆద్యంతం ఆసక్తిగా మలిచారు దర్శకుడు చందు. ఈ కథలో ఆర్టికల్ 370 రద్దు వల్ల పాక్ జైల్లో వారు ఎలాంటి సమస్యల్లో పడ్డారని చూపారు. అప్పటి కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌తోపాటు, ఆమె కూతురు బన్సూరీ స్వరాజ్ వారిని విడిపించడానికి చేసిన సాయం చూపించారు. ముఖ్యంగా తండేల్ కథలో లవ్‌స్టోరీ ఎంత బలాన్ని ఇస్తుందో.. దేశభక్తి కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే..ఈ కథ వెనుక ఉన్న నిజ జీవిత ప్రేరణ.. ప్రేక్షకులలో గాఢంగా ప్రతిధ్వనిస్తుంది.
ఎవరెలా చేశారంటే:
తండేల్ సినిమా కోసం నాగ చైతన్య ప్రాణం పెట్టేశాడని చెప్పొచ్చు. తండేల్ రాజు పాత్రలో జీవించేశాడు. ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టాడు. సహజ నటి సాయి పల్లవి బుజ్జితల్లిగా జీవించేసింది. చైతన్య, సాయి పల్లవి మధ్య సాగే లవ్‌స్టోరీ, కెమిస్ట్రీ బాగా కుదిరింది.
నిజజీవిత పాత్రలు ఐన రాజు-సత్యల కోసమే పుట్టినట్లుగా నటించారు. ఇద్దరూ శ్రీకాకుళం యాసలో సంభాషణలు అద్భుతంగా చెప్పారు. ఆడుకాలం నరేన్, కల్పలత, కరుణాకరన్, పృథ్వీరాజ్, మహేష్ తదితరుల తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు:
ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ప్రాణం పెట్టేశాడు. అందుకు ఉదాహరణ బుజ్జితల్లి, హైలెస్సా సాంగ్స్ అని చెప్పుకోవొచ్చు. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ సాంగ్స్ వంద మిళియన్లకు పైగా వ్యూస్ తో దూసుకెళ్తోన్నాయి. ఇక సినిమాకోసం ఇచ్చిన బీజీఎమ్‌తో దేవిశ్రీప్రసాద్ మ్యాజిక్ చేశాడు. మొత్తానికి సినిమాకు ప్రధాన బలంగా నిలిచాడు దేవి.
సినిమాటోగ్రఫీ షందత్ సయినుద్దీన్ తీసిన విజువల్స్ అభూతంగా ఉన్నాయి. రియల్ సముద్రంలో తీసిన షాట్స్, ప్రతి ఫ్రేమ్ ఉన్నతంగా ఉంటుంది. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. డైరెక్టర్ చందు మొండేటి సినిమాని ఎమోషన్, దేశభక్తి తో ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ అయ్యాడు. గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.