నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఫిబ్రవరి 7న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో నాగచైతన్య సినిమా విశేషాలను గురించి ఇలా వివరించాడు.
నాకు ఎప్పటినుంచో రియల్ లైఫ్ స్టోరీస్ ఆధారంగా ఉండే రూటెడ్ సినిమాలు చేయాలని వుండేది. పైగా ఇది మన తెలుగోళ్ళ కథ కావడంతో కనెక్ట్ అయ్యాను. మొదట విన్నప్పుడు డాక్యుమెంటరీలా అనిపించినా, చందూ సినిమాటిక్‌గా మార్చాక అద్భుతంగా వచ్చింది. ఎనిమిది నెలలు స్క్రిప్ట్, నా ట్రాన్స్‌ఫర్మేషన్ మీదే ఉన్నా. శ్రీకాకుళం యాస నేర్చుకోవడం బిగ్గెస్ట్ ఛాలెంజ్.
చందుతో నాకిది మూడో చిత్రం. నా కోసమే ఆలోచిస్తూ, నన్ను కొత్తగా ప్రజెంట్ చేయడానికి చాలా ప్రయత్నించాడు. రూటెడ్ స్టోరీని కమర్షియల్‌గా తీయడానికి చాలా కష్టపడ్డాడు. ఇందులో మా పాత్రలు శివ పార్వతుల నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు. అందుకే ఆ థీమ్‌లో ఓ సాంగ్ పెట్టారు.
ఇదొక అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ. ఆ ప్రేమకథ వెనుక మిగతా లేయర్స్ ఉంటాయి. లవ్ స్టోరీ, మాస్ ఎలిమెంట్స్‌తో పాటు సర్వైవల్ డ్రామాలో నటించడం చాలా ఇన్ స్పైరింగ్‌గా అనిపించింది. ఎక్కువ భాగం సముద్రంలో షూట్ చేశాం. రియల్ లొకేషన్‌లో తీయడం వల్ల పెర్ఫార్మెన్స్‌కి కూడా ప్లస్ అవుతుంది. అలాగే జైల్ ఎపిసోడ్స్ చాలా ఎమోషనల్‌గా వచ్చాయి.
సాయిపల్లవి అద్భుతమైన నటి. తనతో యాక్ట్ చేయడం ఇష్టం. ఆమెలో మంచి పాజిటివ్ ఎనర్జీ వుంటుంది. క్యారెక్టర్‌ని ఎంతో డీప్‌గా అర్ధం చేసుకుంటుంది. అలాంటి ఒక ఆర్టిస్ట్‌తో కలిసి నటిస్తే మన పెర్ఫార్మెన్స్ కూడా ఎన్ హ్యాన్స్ అవుతుంది. ఇక దేవిశ్రీ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. శామ్ దత్ బ్యూటీఫుల్ విజువల్స్ ఇచ్చారు.
రాజు ఫైటర్. జైల్లో వున్నప్పుడు బాధని ఓర్చుకొని తన వారికోసం ఎలా పోరాటం చేశాడు, ఎలా బయటికి వచ్చాడనేది చాలా గొప్పగా వుంటుంది. తన ప్రేమకథే తనకి బలాన్ని ఇస్తుంది. ప్రతి హానెస్ట్ లవ్ స్టోరీలో ఒక పెయిన్ వుంటుంది. ఇందులో ఆ బాధను బాగా ప్రజెంట్ చేశాం. ముఖ్యంగా ఆ ఎమోషనల్ హై చాలా కొత్తగా వుంటుంది. చివరి ముఫ్ఫై నిమిషాలు వెరీ సాటిస్ఫాక్షన్. ఒక యాక్టర్గా చాలా తృప్తిని ఇచ్చిన సినిమా ఇది.