పదవులపై ఆశ లేదు.. పవన్‌ కల్యాణ్‌ ఆశయాల కోసమే పని చేస్తా: నాగబాబు

పార్టీ కోసం పనిచేసి మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులను అందజేసింది జనసేన పార్టీ. ఈ సందర్భంగా జనసేన కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఒక్కో కుటుంబానికి జనసేన నేత నాగబాబు రూ.5లక్షల చెక్కును  అందించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడారు. వివిధ కారణాల వల్ల చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు ఇప్పటిరకు రూ.1745 కోట్లు అందజేశామన్నారు.  గతంలో మూడు వేల మంది రైతులకు లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించామన్నారు. 

మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించారు నాగబాబు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని రోజుల్లోనే వైసీపీ శవ రాజకీయాలు మొదలుపెట్టిందన్నారు.  రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అడగడానికి జగన్‌కు సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. జగన్‌ హయాంలో అన్ని శాఖల్లో భారీగా అవినీతి జరిగిందని.. దానికి శిక్ష తప్పదని హెచ్చరించారు. 

పదవులపై విలేఖర్లు ప్రశ్నించగా తనకు పదవులపై ఎలాంటి కోరిక లేదని.. ఓపిక ఉన్నంతకాలం పవన్‌ కల్యాణ్‌ ఆశయాల కోసమే పని చేస్తానని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పాలనలో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.