
హైదరాబాద్, వెలుగు: సీఎం ప్రజావాణి పని తీరు బాగుందని నాగాలాండ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు కితాబునిచ్చారు. మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ లో సీఎం ప్రజావాణి కార్యక్రమాన్ని నాగాలాండ్ ప్రభుత్వ అధికారుల బృందం స్వయంగా పరిశీలించింది. ఈ కార్యక్రమం గురించి రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, ప్రజావాణి ఇన్ చార్జ్ చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ వారికి వివరించారు.
సీఎం ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించడం, వాటిని ఆన్ లైన్ లో సంబంధిత శాఖలకు పంపడం, డెస్క్ ఆఫీసర్ల విధులు, హెల్ప్ డెస్క్, ఫిర్యాదుల ట్రాకింగ్ ని నాగాలాండ్ అధికారుల బృందం పరిశీలించింది. సీఎం ప్రజావాణి జరుగుతున్న విధానం చాలా బాగుందని నాగాలాండ్ బృందం కితాబునిచ్చింది. ఈ విధానాన్ని నాగాలాండ్ లో అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని అధికారులు తెలిపారు.