నాగర్‌కర్నూల్, వెలుగు: వ్యక్తిగత స్వార్థంతో పార్టీ మారిన ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి ఫ్యామిలీతో కాంగ్రెస్ పార్టీకి నష్టమే తప్ప, ప్రయోజనం లేదని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం తన ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడువంశీకృష్ణపై ఆయన ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గుండాయిజం, బెదిరింపులు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఫ్యామిలీ కుట్రలను ఎదుర్కొని తాను ఎమ్మెల్యేగా ఎన్నికవుతానని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే 2018 ఎన్నికలకు ముందు కూచుకుళ్ల బీఆర్ఎస్లో చేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మర్రి మర్యాద ఇస్తలేడని చెబుతూ కొడుకును కాంగ్రెస్ పార్టీలోకి పంపిన ఎమ్మెల్సీ ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాడని పేర్కొన్నారు. డీసీసీ ప్రెసిడెంట్, ముఖ్యనేతలు ఆయనకు మద్దతు పలుకుతూ పార్టీ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి, పీసీసీ మెంబర్ బాలా గౌడ్, కోటయ్య, లక్ష్మయ్య, పాండు, బంగారు పర్వతాలు, నిజాముద్దీన్, సుల్తాన్ పాల్గొన్నారు.