12వ శతాబ్దంలోనే మహా మంత్రిగా తెలంగాణ మహిళ నాగమ్మ

ప్రపంచంలోని ఆయా దేశాల చరిత్రలో మాదిరిగానే తెలుగునాట మహిళలు నాయకురాళ్లుగా ఎదిగిన సందర్భాలు చాలా అరుదు. నేటి ఆధునిక యుగంలోనూ అవకాశాలు ఉన్నా, రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పరిమిత స్థాయిలోనే ఉంటున్నది. కానీ తెలుగునాట చరిత్రను తెరిచిచూస్తే..  క్రీస్తు శకం12వ శతాబ్దంలోనే తెలంగాణకు చెందిన నాగమ్మ అనే మహిళ రాజు దగ్గర మహా మంత్రిగా రాణించారు. నేటి కరీంనగర్ జిల్లాలోని ఆరవెల్లి గ్రామం నుంచి తండ్రితో పాటు పల్నాడు(గుంటూరు జిల్లా)కు వలస పోయిన నాగమ్మ, అక్కడ అంచెలంచెలుగా ఎదిగి రాజు దగ్గర ప్రధాన మంత్రి స్థాయికి చేరుకున్నారు. ఆమె ఉన్నతిని తట్టుకోలేని ఇతర మగ పెద్దలు, మత పెద్దలు ఆమెపై అసూయ కత్తులు దూశారు. ఈ పరిస్థితులు దాయాది రాజుల మధ్య అంతర్యుద్ధానికి, ఆ తర్వాత అసలు యుద్ధానికి దారి తీశాయి. ప్రతిపక్ష రాజుకు మంత్రి అయిన బ్రహ్మనాయుడి ఎత్తులకు పైఎత్తులు వేయాల్సి వచ్చింది నాగమ్మకు. ఇరు పక్షాల మంత్రులు ఎవరికి వారే మంచివారు కావచ్చు. కానీ నాయకుడికి విజయమే పరమ లక్ష్యం. అందుకోసం ఎవరి పన్నాగాలు వారు పన్నవచ్చు. అలాగే నాగమ్మ తన అసామాన్యమైన రాజనీతి పటిమతో శత్రువర్గాన్ని ఓడించి విజయం సాధించి నాయకురాలిగా పేరు గడించారు. ఆనాడు స్త్రీ రాజకీయాల్లోకి ప్రవేశించడమే ఊహకందని విషయం కాగా, నాగమ్మ అంతకు మించి మంత్రి కావడం, తన రాజుకు విజయాన్ని కట్టబెట్టడం, తర్వాత దేవాలయాలు కట్టించడం లాంటి ధార్మిక, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అంత చేసినా, పురుష వివక్ష తగ్గకపోవడంతో విసుగెత్తి మళ్లీ తనను కన్న ఊరికి తిరిగి వచ్చారామె. అక్కడా చెరువులు తవ్వించడం వంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తే ఆమెను దేవతతో సమానంగా కీర్తించారు. అందుకే నేటికీ నాగమ్మకు ఆరవెల్లిలో అయిదేండ్లకోసారి కొలుపులు జరుగుతున్నాయి. ఈ మధ్య గుడి కూడా కట్టారు. ఇలా ‘నాగమ్మ వైపుగా’ ఆలోచించి ప్రజలు తమ కృతజ్ఞత తెలుపుకోవడం, నాగమ్మ స్ఫూర్తిని నిలుపుకోవడం జరుగుతున్నది. ఈ మధ్య సుమశ్రీ నాగమ్మ మీద రాసిన ద్విశతకంలో ‘నాగమ్మ తానేమో ఎన్నో కష్టాలను ఎదుర్కొని, పల్నాటి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను మాత్రం రూపుమాపి వారికి సుఖసంతోషాలను అందించడానికై ఎంతో కృషి చేసి అందరికీ ఆరాధనీయురాలైంది’ అంటూ ఆటవెలదులు కూర్చారు.

ప్రజల కోసం దేవాలయాలు కట్టించిన నాగమ్మకు ఎనిమిదిన్నర శతాబ్దాల తరువాత ప్రజలే దేవాలయం కట్టడం ఆమె సేవానిరతికి నిదర్శనమైన నివాళి. అయితే నాగమ్మ చరిత్ర గానం, ఆరాధనం ఈనాటిది కాదు. ఆరు వందల ఏండ్ల కిందట శ్రీనాథ మహాకవి రచించిన ‘పలనాటి వీరచరిత్ర’లో నాగమ్మ చరిత్రను ‘ఆంధ్ర సంస్కృత భాషలమరు గీతముల భావంబు లెస్సగా ప్రకటన చేయ” అని పల్నాడు రాజా స్థానంలో, మాచర్ల చెన్న కేశవాలయంలో నాట్య, నాటక ప్రదర్శనల్లో గానం చేసినట్లు అని రాశాడు. శ్రీనాథుని సమకాలికుడైన వినుకొండ వల్లభరాయుడు తన ‘క్రీడాభిరామం’లో నాగమ్మ చరిత్రను "నల్లంగొండయు, నాగరికల్లును ధరణీస్థలం ప్రగల్బ స్థలముల్’’ లాంటి పద్యపాదాలలో ఏడు వందల ఏండ్ల కిందట ఆనాటి కాకతీయ రాజు ప్రతాపరుద్రుని రాజధానియైన ఓరుగల్లులో, పల్లెల్లో జానపదులు నాగమ్మ చరిత్రను కథలు కథలుగా చెప్పుకొనేవారని తెలుస్తున్నది. పటం కథలుగా ప్రదర్శించేవారని, ఆమె కథలో ఆమె నల్లగొండ, నాగర్ కర్నూల్ మొదలైన తెలంగాణ నగరాల్లో చేసిన రాజనీతి ఘట్టాలుండేవని విశదమవుతున్నది. ఇలా నాగమ్మ నికార్సయిన తెలంగాణ ఆడబిడ్డ అని అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని కొండవీడు ప్రదర్శనశాలలో ఇటీవల నాయకురాలు నాగమ్మ బృహత్ విగ్రహాన్ని సందర్శకుల కోసం ఆవిష్కరించారు. ఆమె స్ఫూర్తిని భావి తరాలకు, ప్రత్యేకించి యువతులకు అప్రతిహతంగా అందించడానికి  తెలంగాణ ప్రభుత్వం, మేధావులు, మహిళామణులు కృషి చేయాలి.  ఆమె వీరోచిత విగ్రహాన్ని ఆరవెల్లిలో, కరీంనగర్ లో, హైదరాబాద్ లోనూ నిలుపుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాగమ్మ చరిత్రను పాఠ్యాంశంగా పెడితే, రేపటి మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

‘‘తల్లి, తండ్రి, మామ, తాళి కట్టిన భర్త
చిన్న వయసులోన నిన్ను వదలి
వెడలిపోవ ఎంత వేదన పడినావొ
త్యాగమూర్తివమ్మ నాగమాంబ’’

- డా. ద్యావనపల్లి సత్యనారాయణ,
తెలంగాణ చరిత్రకారుడు