- మిల్లర్లను హెచ్చరించిన నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్
- గడువులోగా బియ్యం అందించకపోతే కఠిన చర్యలు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఈ నెల 31 లోగా కస్టమ్ మిల్లింగ్ రైస్ ను అందించాలని, నిర్లక్ష్యం వహించే మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో రైస్ మిల్లర్లతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 31వ తేదీ లోగా పెండింగ్ లో వున్న సీఎంఆర్ అందించకుంటే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, తహసీల్దార్లతో మిల్లులను తనిఖీ చేయించి బ్లాక్ లిస్ట్ లో ఉంచుతామని కలెక్టర్ హెచ్చరించారు.
2023 ఖరీఫ్ కు సంబంధించిన 73136.680 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం, జిల్లాలోని 84 రైస్ మిల్లులు అందించగా రైస్ మిల్లులకు పంపిణీ చేసిన వడ్లను 49246.930 మెట్రిక్ టన్నుల బియ్యంగామార్చి ప్రభుత్వానికి అందించాల్సి ఉండగా ఇప్పటివరకు 28886.094 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్ సి ఐ కి అందించారన్నారు. పెండింగ్ లో ఉన్న 20360.835 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈనెల 31వ తేదీలోగా ఎఫ్ సీఐకి అందించాలని కలెక్టర్ మిల్లర్లకు ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి కే. శ్రీనివాస్, డియం సివిల్ సప్లై రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
హాస్టళ్లు, స్కూళ్లలో వసతులు కల్పించాలి
సంక్షేమ శాఖలు తమ నిర్వహణలో ఉన్న హాస్టల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలో గల మౌలిక సదుపాయాలైన త్రాగునీరు, టాయిలెట్లు, క్రీడా వసతులు, ప్రహరీ గోడలు, విద్యార్థులకు కావాల్సిన కనీస సదుపాయాలను గుర్తించాలని సూచించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సి ఎస్ ఆర్) నిధుల ద్వారా ఆయా శాఖల కనీస అవసరాలు మౌలిక సదుపాయాలను కల్పించడానికి వీలవుతుందన్నారు. నాగర్ కర్నూల్ మండలం మంతటి, తాడూరు మండలం వెంకటాపూర్ గ్రామంలోని పాఠశాలలను విజిట్ చేశారు.