ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

వీపనగండ్ల(చిన్నంబావి), వెలుగు:  గ్రామాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీని అధికారంలోకి తేవాలని ఆ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు ప్రజలను కోరారు. ఆయన చేపట్టిన పాదయాత్ర ఆదివారం వెల్టూర్ నుంచి అయ్యవారిపల్లి,  కాలూర్, కొప్పునూర్, లక్ష్మీ పల్లి గ్రామాల మీదుగా సాగింది. ఆయా గ్రామాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించి  ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ కొల్లాపూర్‌‌‌‌కు రాష్ట్ర సర్కారు చేసిందేమీ లేదని, ఇక్కడి ఎమ్మెల్యే, మాజీ మంత్రితో వర్గపోరును తప్ప దేన్నీ పట్టించుకోవడం లేదన్నారు. ఇద్దరు నేతల మధ్య నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.  బీఆర్‌‌‌‌ఎస్‌‌కు వచ్చే ఎన్నికలే చివరివని, రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  కేంద్రం ఇప్పటికే నేషనల్ హైవే రోడ్డు, సోమశిల–సిద్దేశ్వరం బ్రిడ్జికి నిధులు మంజూరు చేసిందని గుర్తుచేశారు.

ధర్మ పరిరక్షణకు యువత ఏకమవ్వాలి

వనపర్తి, వెలుగు: హిందూ ధర్మ పరిరక్షణకు యువత ఏకమవ్వాలని వీహెచ్‌‌పీ ప్రాంత ప్రధాన కార్యదర్శి శాలివాహన పండరినాథ్ జీ పిలుపునిచ్చారు. ఆదివారం శౌర్య ప్రతాప్ దివస్, గీతా జయంతి వేడుకలను పురస్కరించుకుని వీహెచ్‌‌పీ కార్యకర్తలు భజరంగ్ దళ్ సంయోజక్ సాయికిరణ్ అధ్యక్షతన వనపర్తిలో ర్యాలీ నిర్వహించారు.  అనంతరం పండరినాథ్  మాట్లాడుతూ  దేశంలో హిందూ సంస్కృతిపై జరుగుతున్న దాడులను ఖండించారు.  దేశానికి వెన్నెముక అయిన యువత సంఘటితమై దేశ ప్రజలను ఏకం చేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టాలని, ధర్మ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న వారిని  దారిలో పెట్టాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ప్రముఖ జాతీయవాది కొమ్ము శ్రీనివాస్ , వీహెచ్‌‌పీ వనపర్తి జిల్లా కార్యదర్శి వాకిటి హర్షవర్ధన్,  భజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ శివకృష్ణ పాల్గొన్నారు. 

ఫుట్​బాల్​ అకాడమీ తీసుకొస్తా ..

మహబూబ్​నగర్​ రూరల్​, వెలుగు : పాలమూరు జిల్లాకు ఫుట్​బాల్ అకాడమీ తీసుకొస్తానని క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ ప్రకటించారు.  జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజ్​ గ్రౌండ్​ జరుగుతున్న పీర్ హషీం జిల్లా స్థాయి ఫుట్ బాల్ టోర్నీని ఆదివారం ప్రారంభించారు. అంతకు ముందుఈ నెల 20, 21వ తేదీల్లో ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో జరగనున్న ‘పిల్లలమర్రి బాలోత్సవం.. పిల్లల జాతర’కు సంబంధించిన వాల్ పోస్టర్​ను ఆవిష్కరించారు. సాయంత్రం రూరల్​ మండలం రామచంద్రపురంలో జరిగిన కాళీకా దేవి జాతరలో మంత్రి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ చదువుతో పాటు ఆరోగ్యం అవసరమన్నారు. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగానే రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు 7,600 గ్రామాలలో గ్రౌండ్స్‌‌ అందుబాటులోకి తెచ్చామని వివరించారు. 

యువకులు గ్రామాభివృద్ధిలోభాగస్వాములవ్వాలి
    
మరికల్​, వెలుగు:  యువకులు గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ఎస్​.రాజేందర్​రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం  యువక మండలి భవనంలో కొత్తగా నిర్మించిన లైబ్రరీ బిల్డింగ్‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా టైమ్‌‌లో యువక మండలి సభ్యులు సేవ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.  లైబ్రరీలో ఫర్నిచర్​తో పాటు పుస్తకాలను సమకూర్చుకోవడానికి  సీడీపీ నిధుల నుంచి రూ.2 లక్షలు ఇస్తానని  హమీ ఇచ్చారు.  అనంతరం యువక మండలి అధ్యక్షుడు ఆంజనేయులు, కమిటీ సభ్యులు, దాతలను సత్కరించారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఐపీఎస్​ అధికారి కెప్టెన్​ శ్రీనివాసులు, వైస్​ ఎంపీపీ రవికుమార్​, సర్పంచ్‌‌ కె.గోవర్దన్​, ఎంపీటీసీలు సుజాత, గోపాల్​ పాల్గొన్నారు.

లారీ ఢీకొని వృద్ధుడి మృతి

పెబ్బేరు, వెలుగు : లారీ ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఎస్సై రామస్వామి వివరాల ప్రకారం.. పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన రామచంద్రయ్య(70) ఆదివారం మటన్ తెచ్చేందుకని పెబ్బేరు వెళ్లాడు.  బస్సులో తిరిగి ఇంటికి బయల్దేరిన ఆయన జనుంపల్లి క్రాస్ రోడ్డు వద్ద దిగాడు. రోడ్డు దాటే క్రమంలో నిలబడి ఉండగా జనుంపల్లి వైపు నుంచి రివర్స్‌‌ తీసుకుంటున్న ఓ లారీ అతన్ని ఢీకొట్టింది. లారీ వెనుక టైరు రామచంద్రయ్యపై నుంచి వెళ్లడంతో  అక్కడికక్కడే చనిపోయాడు.  మృతుడి కొడుకు నరసింహ ఫిర్యాదు మేరుకు పెంచికలపాడుకు చెందిన లారీ డ్రైవర్​ ఎండి. మైబూపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై 
తెలిపారు. 

క్రూజర్ బోల్తా పడి 12 మందికి గాయాలు 

కొత్తకోట, వెలుగు: పెళ్లికి వెళ్తున్న తుఫాన్‌‌ వాహనం ఎన్‌‌హెచ్‌‌ 44పై బోల్తా పడి 12 మందికి గాయాలయ్యాయి.   స్థానికుల వివరాల ప్రకారం..  మండలంలోని కానాయపల్లికి చెందిన 12 మంది ఆదివారం హైదరాబాద్‌‌లో జరుగుతున్న బంధువు వివాహానికి క్రూజర్‌‌‌‌లో బయల్దేరారు.  డ్రైవర్ వాహనాన్ని వేగంగా నడపడంతో  అదుపుతప్పి పల్టీలు కొడుతూ పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆశమ్మ, పద్మమ్మ కు తీవ్ర గాయాలు కాగా.. మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలించారు. 

కారు, స్కూటీ ఢీకొని ఇద్దరికి..

జడ్చర్ల టౌన్​, వెలుగు: జడ్చర్ల సమీపంలోని కొత్త తండా వద్ద ఎన్‌‌హెచ్‌‌167 పై  కారు, స్కూటీని ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు..  కొత్తతండాకు చెందిన శంకర్ నాయక్, సాయి శంకర్ ఆదివారం తండాలో ఓ వ్యక్తి చనిపోవడంతో అంత్యక్రియలు పూర్తి చేసి స్కూటీపై జడ్చర్లకు వెళ్తున్నారు. జడ్చర్ల వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన క్వాలిస్ స్కూటీని ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి.  స్థానికులు వెంటనే 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా,  స్పీడ్ బ్రేకులు వేయకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయంటూ  గిరిజనులు రోడ్డుపై ఆందోళనకు దిగారు.  

అనుమానాస్పదంగా ఇద్దరు మృతి

అచ్చంపేట, వెలుగు: వేర్వేరు ఘటనల్లో అనుమానాస్పదంగా ఇద్దరు మృతి చెందాడు.   సీఐ అనుదీప్ వివరాల ప్రకారం..  అచ్చంపేట మండలం గుంపన్​ పల్లి గ్రామానికి చెందిన మూడావత్​శివ(30) ఆదివారం హైదరాబాద్​ చౌరస్తాకు సమీపంలో విగత జీవిగా పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు వెంటనే  పోలీసులకు సమాచారం ఇచ్చారు.  అక్కడికి చేరుకున్న పోలీసులు డెడ్‌‌బాడీని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం   బంధువులకు అప్పగించారు.  శివ మృతిపై అనుమానాలు ఉన్నాయని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.  అక్రమ సంబంధమే మృతికి కారణమని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు.  మృతుడి భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. 

బల్లూరు మండలం గోదల్‌‌లో...

బల్మూ‌‌‌‌ర్​ మండలం గోదల్‌‌ గ్రామంలోనూ ఓ వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడు. ఎస్సై సదానంద గౌడ్​ వివరాల ప్రకారం..  గోదల్‌‌కు చెందిన మేడి పూరి వెంకటయ్య (51) శనివారం గ్రామంలో ఓ వ్యక్తి మృతి చెందగా అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చి మంచంపై పడుకున్నాడు. 7 గంటల ప్రాంతంలో కుటుంబసభ్యులు  పిలిచినా పలుకపోవడంతో వెంటనే 108కు కాల్ చేశారు.  అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది వెంకటయ్యను పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు.  దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా డెడ్‌‌బాడీని అచ్చంపేట సివిల్ హాస్పిటల్​కు తరలించారు. ఆదివారం పోస్టు మార్టం నిర్వహించి డెడ్‌‌బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. మృతుని చెల్లెలు మైబమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. 

బస్తీ దవాఖానాలతో ప్రజల చెంతకే వైద్యసేవలు

గద్వాల, వెలుగు: ప్రజల దగ్గరికే వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.  ఆదివారం గద్వాల టౌన్ లోని 24 వ వార్డులో బస్తీ దవాఖానా, పట్టణ ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..హెల్త్ మినిస్టర్ హరీశ్ రావుతో మాట్లాడి గద్వాల టౌన్‌‌లో మరో రెండు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.  అనంతరం  లక్ష్మీ నరసింహస్వామి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్‌‌ కేశవ్, కన్జూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్ శ్రీను  పాల్గొన్నారు.

పెబ్బేరుకు చేరుకున్న జాతీయ సమైక్యతా మారథాన్‌‌

పెబ్బేరు, వెలుగు : వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కల్నల్ క్రిషన్ సింగ్ బద్వార్ కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు చేపట్టిన జాతీయ సమైక్యతా మారథాన్‌‌ ఆదివారం పెబ్బేరు మండలం తోమాలపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా అడిషనల్‌‌ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ 8వ బెటాలియన్‌‌ ఎన్‌‌సీసీ బృందంతో కలిసి   స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  రోజుకు 50 కిలో మీటర్ల చొప్పున  మారథాన్ చేపట్టడం గొప్ప విషయమని కొనియాడారు.  ఆదివారం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో బస చేసి సోమవారం కంటిన్యూ చేస్తారని చెప్పారు.  కల్నల్ బద్వార్ మాట్లాడుతూ..  యువతలో జాతీయ సమైక్యతను పెంపొందించాలనే లక్ష్యంతో మారథాన్‌‌ చేపట్టానన్నారు. బెటాలియన్ కమాండింగ్ అధికారి జీబీఎంకే రావ్, పాలిటెక్నిక్​ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఎన్. శ్రీనివాస్ పాల్గొన్నారు.