- కేసు ఫైల్ చేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్
కల్వకుర్తి, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ ఎస్ఐ రవికుమార్ మంగళవారం రాత్రి రూ.50 వేలు లంచం డిమాండ్ చేసిన కేసులో ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ కథనం ప్రకారం..కల్వకుర్తికి చెందిన డేరంగుల వెంకటేశ్ ఇంట్లో ఈ నెల 17న ఏడు బాక్సుల జిలెటిన్ స్టిక్స్, రెండు బాక్సుల డిటోనేటర్లను పోలీసులు పట్టుకున్నారు. విచారణ పేరిట నిందితుడిని వెల్దండ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే..
రూ.50 వేలు ఇవ్వాలని ఎస్ఐ రవికుమార్ డిమాండ్ చేశాడు. దీంతో వెంకటేశ్ఈ నెల17న ఏసీబీని ఆశ్రయించాడు. మధ్యవర్తి ద్వారా డబ్బులు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. కల్వకుర్తి పట్టణానికి చెందిన అంబులెన్స్ డ్రైవర్ విక్రమ్ ద్వారా డబ్బులు పంపాలని ఎస్ఐ సూచించాడు. ఈ మేరకు మంగళవారం రాత్రి విక్రమ్‌కు ఓ దవాఖాన వద్ద డబ్బులు ఇస్తుండగా..ఏసీబీ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు.
మధ్యవర్తితో పాటు ఎస్ఐ రవి కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని బుధవారం హైదరాబాద్ నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ తెలిపారు.