- రెండేండ్ల కింద లోన్స్ మంజూరైనా గ్రౌండింగ్ చేయరా?
- దిశ మీటింగ్‌లో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి ఫైర్
వనపర్తి, వెలుగు: బడుగు, బలహీన వర్గాలు, నిరుపేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పాలసీలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి, ప్రధాన మంత్రి సురక్ష యోజన, ఆటల్ పెన్షన్ యోజన వంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం చట్ట సభల్లో బిల్లు పెట్టి అమలు చేస్తుందని తెలిపారు.
ఇంత ప్రాముఖ్యత ఉన్న స్కీమ్‌లపై ప్రజల్లో అవగాహన కల్పించకుండా బ్యాంకర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కో బ్యాంక్‌కు నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై లీడ్ బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ మేనేజర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి పథకానికి ఏడాదికి రూ.430 ప్రీమియం కడితే రూ.2 లక్షల జీవిత బీమా వస్తుందని, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఏడాదికి రూ.20 చెల్లిస్తే పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ. లక్ష, శాశ్వత అంగ వైకల్యం ఏర్పడితే రూ.2 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుందన్నారు. అటల్ పెన్షన్ స్కీం కింద నెలకు రూ.300 చెల్లిస్తే 60 ఏండ్ల తరువాత నెలకు రూ.5 వేల పెన్షన్ ఇస్తారన్నారు. ఇలాంటి బీమా పథకాలను ప్రజలకు చేరవేయడంలో బ్యాంకులు పూర్తిగా నిర్లక్ష్యం వహించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో బ్యాంకు మొక్కుబడిగా బీమా చేయించారని, వాటి రెన్యువల్ వచ్చేసరికి జీరో అయిందన్నారు.
రుణాలివ్వడంలోనూ అదే నిర్లక్ష్యమా?
ముద్ర, టర్మ్ లోన్, ప్రయారిటీ సెక్టార్, నాన్ ప్రయారిటీ సెక్టార్ వారీగా ఇవ్వాల్సిన రుణాలు సైతం అంతంత మాత్రంగానే ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట రుణాలు సైతం బ్యాంకర్లు లక్ష్యం మేరకు ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. వచ్చే దిశ సమావేశం నాటికి లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు. ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా యువతకు, మహిళల స్వయం ఉపాధి కోసం 80 శాతం సబ్సిడీతో 2021–-22లో మంజూరైన రుణాలు ఇప్పటికీ గ్రౌండింగ్ కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 శాతం డబ్బులు ప్రభుత్వం ద్వారా మంజూరై బ్యాంకుల్లో మూలుగుతున్నా 20 శాతం రుణం ఇవ్వకుండా ఆలస్యం చేయడమేమిటని ప్రశ్నించారు.
వారం రోజుల్లో సబ్సిడీ రుణాలు గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. కొంత మంది బ్యాంక్ మేనేజర్లు సమావేశానికి గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి నోటీసులు ఇవ్వాలని కలక్టర్ కు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలను అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పని చేసి పకడ్బందీగా అమలు చేస్తే ప్రజలకు పూర్తి స్థాయిలో ఫలాలు అందుతాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 28 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అన్ని మతాలు, కులాల విద్యార్థులు ఒకే చోట నాణ్యమైన విద్యను పొందే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. వనపర్తి జిల్లాలోని అన్ని గురుకులాలు, హాస్టళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం, రిపేర్లకు సంబంధించి ప్రపోజల్స్ ఇవ్వాలని, ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ, పౌర సరఫరాల శాఖ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖలపై రివ్యూ చేశారు.
ఈ నెల 22న నాగర్ కర్నూల్లో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ వర్క్ షాప్ ఏర్పాటు చేసినట్లు ఎంపీ తెలిపారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ సంక్షేమ శాఖల ద్వారా సబ్సిడీ రుణాల గ్రౌండింగ్ పై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వనపర్తి, దేవరకద్ర ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మైనారిటీ బోర్డు చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, దిశ కమిటీ సభ్యులు వీరయ్య, ఆంజనేయులు, చిన్నమ్మ థామస్, వెంకటేశ్, శంకర్ నాయక్, ధనలక్ష్మి, డీఆర్డీవో ఉమాదేవి, లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిశోర్ పాండే పాల్గొన్నారు.