
- హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నెం.181, 182లోని దాదాపు 50 ఎకరాల భూమి భూదాన బోర్డుకు చెందినదేనని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. వీటిపై భూదానబోర్డు సుమోటోగా విచారణ పూర్తి చేసిందని తెలిపింది. తగిన ఆదేశాలు వెలువరించాల్సివుందని, వివరాలు సమర్పించేందుకు 2 వారాల గడువు కావాలని కోరింది.
ఈ మేరకు భూదాన్ బోర్డు కాంపిటెంట్ అథారిటీ అధికారిగా రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేశారు. సర్వే నంబరు 182లో 10 ఎకరాల భూమికి సంబంధించి ఖాదర్ ఉన్నీసాకు వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీ చేసిన అప్పటి కలెక్టర్ అమోయ్‌కుమార్, డీఆర్‌వో జ్యోతిపై చర్యలు తీసుకోవాలన్న ఫిర్యాదును పట్టించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ నవాబ్ ఫరూఖ్‌ఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి.. భూదాన్ బోర్డు భూములపై విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో భూదాన్ బోర్డు అధీకృత అధికారి హోదాలో నవీన్‌మిట్టల్ హైకోర్టులో కౌంటరు దాఖలు చేశారు. భూ యజమాని మహమ్మద్ హజీఖాన్ సర్వే నెం.181, 182లో తనకున్న 103.22 ఎకరాల భూమిలో 50 ఎకరాలను భూదాన్ బోర్డుకు విరాళంగా ఇచ్చారన్నారు. పట్టాదారు నుంచి భూమిని విరాళంగా పొందిన తరువాత రెవెన్యూ అధికారులు రికార్డుల్లో ఎంట్రీలు చేయకపోవడంతో దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు పలు లావాదేవీలు నిర్వహించినట్లు నవీన్ మిట్టల్ పేర్కొన్నారు.
ఈ వ్యవహారాన్ని భూదాన బోర్డు అధీకృత అధికారిగా, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిగా సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతున్నామని.. అందువల్ల పూర్తి వివరాలు సమర్పించడానికి రెండు వారాల గడువు కావాలని కోర్టును కోరారు. దాంతో కోర్టు విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది.