- ఎఫ్‌ఐఆర్‌లో ఐఏఎస్ అమోయ్ కుమార్ పేరు చేర్చే చాన్స్
- సివిల్ నేచర్ పేరిట గతేడాది కేసు క్లోజ్
- మళ్లీ దర్యాప్తు జరపాలని డీజీపీకి ఈడీ సూచన
- ఇలాంటి కేసులన్నీ రీఓపెన్చేయాలని రాచకొండసీపీకి డీజీపీ ఆదేశం
- ఎఫ్ఐఆర్ లో ఐఏఎస్ అమోయ్‌కుమార్ పేరు చేర్చే చాన్స్
- సివిల్ నేచర్ పేరిట గతేడాది కేసు క్లోజ్
- డీజీపీని రీఎంక్వైరీ కోరిన ఈడీ
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం భూదాన్ భూముల కేసును పోలీసులు మళ్లీ రీఓపెన్ చేయనున్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్‌కుమార్ పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు మనీలాండరింగ్ యాక్ట్ కింద అరెస్టులకు రంగం సిద్ధం చేశారు. ఈ కేసుతో పాటు ఈడీకి అందిన 12 ఫిర్యాదుల ఆధారంగా స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయనున్నారు. ఈ మేరకు డీజీపీ జితేందర్ రాచకొండ సీపీ సుధీర్‌బాబుకు శనివారం ఆదేశాలు జారీ చేశారు.
సివిల్ నేచర్ పేరుతో క్లోజ్ చేసిన నాగారం కేసు సహా ఇలాంటి కేసుల్లో తిరిగి విచారణ ప్రారంభించాలని చెప్పారు. కేసు దర్యాప్తులో ఈడీ అధికారులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. దీంతో 42 ఎకరాల 33 గుంటల భూదాన్ భూములకు సంబంధించిన కేసు రికార్డులను స్థానిక పోలీసులు మళ్లీ బయటకు తీస్తున్నారు. విచారణ జరపడంతో పాటు సబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
ఈడీ దర్యాప్తుతో వెలుగులోకి..
నాగారం భూదాన్ భూములకు సంబంధించిన కేసును సివిల్ నేచర్ పేరిట గతేడాది మహేశ్వరం పోలీసులు క్లోజ్ చేశారు. ఈ మేరకు కోర్టుకు ఫైనల్ రిపోర్ట్ అందించారు. దీంతో మాజీ తహసీల్దార్ జ్యోతి సహా మరికొంత మంది నిందితులపై నమోదైన ఎఫ్‌ఐఆర్ గతేడాది ఆగస్టులో క్లోజ్ అయ్యింది. అయితే దీంట్లో అప్పటి కలెక్టర్ అమోయ్‌కుమార్ పేరు ప్రస్తావనకు రాలేదు. కాగా, ఈడీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 181 సర్వే నెంబర్పరిధిలోని 42.33 ఎకరాల భూదాన్భూములను అమోయ్కుమార్ఆదేశాల మేరకు అప్పటి తహసీల్దార్ జ్యోతి.. పలువురు రియల్టర్లు, ప్రజాప్రతినిధులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు ఈడీ గుర్తించింది. కేసు తీవ్రత నేపథ్యంలో మళ్లీ రీఓపెన్ చేసి సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఈడీ అధికారులు శుక్రవారం డీజీపీని కలిశారు. ఇలాంటివే గ్రేటర్ పరిధిలో మూసివేసిన మరికొన్ని కేసులను కూడా పరిశీలించాలని కోరారు.
ఈడీ ఆధారాలతో అరెస్టులకు రంగం సిద్ధం..
ఈడీకి అందిన 12 ఫిర్యాదులను కూడా స్థానిక పోలీసులు మళ్లీ సమీక్షిస్తున్నారు. నాగారం కేసుకు సంబంధించి గతంలో మహేశ‍్వరం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను పునఃపరిశీలించడంతో పాటు ఐఏఎస్ అమోయ్‌కుమార్ పాత్రపై సమగ్ర దర్యాప్తు జరుపనున్నారు. ఇప్పటికే కేసు దర్యాప్తులో భాగంగా ఐఏఎస్ అమోయ్‌కుమార్ ను ఈడీ అధికారులు మూడ్రోజుల పాటు విచారించారు. అమోయ్‌కుమార్‌తో పాటు మహేశ్వరం మాజీ తహసీల్దార్ జ్యోతి సహా దాదాపు 15 మందికి పైగా స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు.ఈ క్రమంలోనే గతంలో నమోదైన కేసుల వివరాలను ఉన్నతాధికారులు సేకరించారు. వీటిని విశ్లేషించి అందులోని వాస్తవాల ఆధారంగా మళ్లీ కేసులు నమోదు చేయనున్నారు. ఈడీ, పోలీసుల జాయింట్ ఇన్వెస్టిగేషన్‌తో భూ అక్రమాలకు పాల్పడిన అధికారులు, ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయనున్నారు.