
- ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం
యాదాద్రి, వెలుగు : రాజీవ్ యువ వికాసం పథకానికి రేషన్ కార్డు లేనివారు ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి ప్రీతం సూచించారు. శుక్రవారం భువనగిరిలోని ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ఆయన సందర్శించి రాజీవ్ యువ వికాసం పథకం క్రింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. దరఖాస్తుదారులతో చర్చించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకానికి రేషన్ కార్డు ఉన్నవారు ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. రూ.లక్ష, రెండు లక్షల యూనిట్లకు అతితక్కువ దరఖాస్తులు వచ్చాయని, ఆ యూనిట్లకు సబ్సిడీ అధికంగా ఉన్నందున దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో కృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్ సుందర్, ఎంపీడీవో శ్రీనివాసులు, తహసీల్దార్ అంజిరెడ్డి, ఎంపీవో దినకర్ పాల్గొన్నారు.