బషీర్ బాగ్, వెలుగు: డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను పాటించే ప్రభుత్వాలకు మాత్రమే మనుగడ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. సోమవారం తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ గంటా చక్రపాణితో కలిసి ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మెరుగు నాగార్జున పరిశీలించారు.
విగ్రహ నిర్మాణ ప్రక్రియ, విశిష్టతల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా పని చేశానని.. హైదరాబాద్ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందిందని కొనియాడారు. అంబేద్కర్ చరిత్రను భావితరాలకు తెలిసేలా ఆయన విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఏపీలో ఇదే తరహాలో రూ.400 కోట్లతో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.