మహేష్ భట్ సమర్పణలో ఆయన స్వీయ రచనలో రూపొందిన హారర్ మూవీ ‘1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్’. అవికా గోర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి కృష్ణ భట్ దర్శకత్వం వహించారు. విక్రమ్ భట్ ప్రొడక్షన్‌పై రాకేష్ జునేజా, శ్వేతాంబరీ భట్, డా. రాజ్‌కిషోర్ ఖవ్రే నిర్మించారు. జూన్ 23న సినిమా విడుదల కానుంది. గురువారం ట్రైలర్‌ను నాగార్జున రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘మహేష్ భట్ గారిని కలసి దాదాపు ఇరవై ఏళ్ళయింది. భట్ గారు నాకు గురువు. చాలా స్ఫూర్తిని ఇచ్చే వ్యక్తి. ‘బ్రహ్మాస్త్ర’ సినిమా టైమ్‌లో అలియా ద్వారా ఆయన గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆయన్ని కలవగానే ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. ‘1920’ ట్రైలర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది.
నాకు హారర్ సినిమాలు చూడాలంటే భయం. కానీ ఈ సినిమా చూడాలనిపిస్తుంది. అవికా కెరీర్‌లో ఇది పెద్ద హిట్ అవుతుందనిపిస్తుంది. అలాగే ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ టీమ్‌కు కూడా ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు. ‘ఇదొక ఎమోషనల్ స్టోరీ. హారర్‌లో ఎమోషన్ ప్రయత్నించడం ఇదే తొలిసారి’ అన్నాడు కృష్ణ భట్. మహేష్ భట్ మాట్లాడుతూ ‘నాగార్జున గారు వాళ్ళ నాన్నగారి విలువలు, సంస్కారం ముందుకు తీసుకువెళ్తున్నారు. విలువలు, సంస్కారంను కాపాడుకోవడం చాలా ముఖ్యం. 1920 కథ కూడా దీని గురించే. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని
నమ్ముతున్నాను’ అని అన్నారు.