పంట నష్టం అంచనాలో వ్యవసాయ శాఖ  

  • మరో ఐదు రోజుల్లో పూర్తి చేసేలా అధికారుల చర్యలు  

హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం శివారులోని వేంపాడు స్టేజీ సమీపంలోని యూటీ వద్ద సాగర్ ప్రధాన ఎడమ కాల్వకు ఈనెల 7న పడిన గండి పూడ్చివేత పనులను ఎన్ఎస్​పీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. ప్రాజెక్ట్​ సీఈ శ్రీకాంత్​ రావు, ఎస్ఈ ధర్మానాయక్ ఆధ్వర్యంలో ఎన్ఎస్​పీ ​డీఈలు, ఏఈలు పనులను పర్యవేక్షిస్తున్నారు. గురువారం గండిపడిన ప్రదేశానికి 20 మీటర్ల దూరంలో ప్రధాన కాల్వలోకి దిగేందుకు జేసీబీతో మట్టి తొలగించి ర్యాంపును ఏర్పాటు చేయగా, శుక్రవారం గండిపడిన ప్రదేశంలోకి నీళ్లు రాకుండా ఇసుక బస్తాలతో రింగ్​ ఏర్పాటు చేశారు. ఎడమ కాల్వలోకి సీపేజ్​వాటర్​ఎక్కువగా వస్తుడడంతో పనులకు ఆటంకం కలుగుతోందని ఇరిగేషన్​ అధికారులు చెప్పారు. నీళ్లు పూర్తి స్థాయిలో తగ్గిన తర్వాతే గండి పడిన ప్రదేశంలో ఇసుక బస్తాలు, మట్టికట్టను వేసేలా ప్లాన్​ తయారు చేసినట్టు ఇరిగేషన్​ డీఈ సంపత్​ తెలిపారు. ప్రస్తుతం ఎడమకాల్వ పరిధిలో వరినాట్లు వేయగా కాల్వకు సీసీ లైన్​ వేసే అవకాశం లేదన్నారు. మరో ఐదు రోజుల్లో రిపేర్లు పూర్తి చేసి ఎడమ కాల్వకు నీటి విడుదల చేసే అవకాశం ఉందన్నారు. 

పంట నష్టం అంచనాలో వ్యవసాయ శాఖ  
గండి కారణంగా నిడమనూరు మండలంలోని నర్సింహాలగూడెం, నిడమనూరు, బంకాపురం, వెనిగండ్ల గ్రామాలలో సుమారు 2 వేల ఎకరాల్లో వరినాట్లు కొట్టుకుపోయిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అలాగే మోటార్లు, స్టార్టర్లు కొట్టుకుపోగా ఆ వివరాలు సేకరిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేయడంతో రైతుల పొలాలను గుర్తించడం, నష్టాన్ని అంచనా వేయడం అధికారులకు కష్టంగా మారింది. దీంతో పాటు నిడమనూరులో ఎస్సీ గురుకుల స్కూల్​ ప్రహరీ కొట్టుకుపోయింది. విద్యార్థుల పుస్తకాలు, సామగ్రి కూడా కొట్టుకుపోయాయి. ఆవరణలో బురద ఉండడంతో స్కూల్​కు కొద్దిరోజులు సెలవు ప్రకటించారు. సమీపంలోని వరికోత మిల్లుతో పాటు ఇటుకల బట్టీలో యంత్రాలు, మోటార్లు పూర్తిగా తడిచిపోయి, ఇటుకలు..మొద్దులు కొట్టుకుపోయాయి. అయినా తమకు జరిగిన నష్టాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని యజమానులు వాపోతున్నారు.