సాగర్ ఎలక్షన్​ ఎఫెక్ట్..నెలలో 10 వేల కేసులు

సాగర్ ఎలక్షన్​ ఎఫెక్ట్..నెలలో 10 వేల కేసులు

హాలియా, వెలుగు:  ఏప్రిల్​లో జరిగిన ఉప ఎన్నికల పుణ్యమా అని నాగార్జునసాగర్​ నియోజకవర్గంలో కరోనా తీవ్రరూపం దాల్చింది.  కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఎన్నికలకు  నెల రోజుల ముందు నుంచి జరిగిన ప్రచారం, ముఖ్యంగా అదే నెల 14న సీఎం కేసీఆర్​ బహిరంగ సభ కారణంగా నెలరోజుల్లో ఏకంగా 10 వేల పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో 100 మంది చనిపోయారు. ఒక్క హాలియా మండలంలోనే 25 మంది మృతి చెందారంటే ఎలక్షన్​ఏ స్థాయిలో ప్రాణనష్టం కలిగించిందో అర్థం చేసుకోవచ్చు. 
కొంపముంచిన బై ఎలక్షన్​ 
ఏప్రిల్ 17న నాగార్జునసాగర్​ఉప ఎన్నిక జరిగింది. అంతకు నెల రోజుల ముందు నుంచే పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. ముఖ్యంగా విజయంపై కన్నేసిన రూలింగ్​పార్టీ రాష్ట్ర నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు, మంత్రులు, వేలాది మంది నేతలు, కార్యకర్తలను సాగర్​లో దింపింది. నేతలు కొవిడ్​రూల్స్​ పాటించకుండా ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఎన్నికలకు 3 రోజుల ముందు ఏప్రిల్​14న హాలియాలో సీఎం కేసీఆర్ ​బహిరంగ సభలో  దాదాపు 70 వేల మంది పాల్గొన్నారు. ఇక్కడా కొవిడ్ ​రూల్స్ ​పాటించలేదు. 17న జరిగిన ఎన్నికల్లో 1,89,772 మంది ఓటేశారు. పోలింగ్​ కేంద్రాల్లో ఓటర్లు మాస్కులు వేసుకున్నా.. డిస్టెన్స్​పట్టించుకోలేదు. 
పెరుగుతున్న కేసులు, మృతులు 
నెల రోజుల్లో నాగార్జునసాగర్​ నియోజకవర్గంలో 10వేల మందికి పైగా కరోనా సోకింది. నాగార్జునసాగర్​మండలంలో 3 వేల కేసులు, అనుముల మండలంలో 2,200, హాలియా మున్సిపాలిటీలో 500, పెద్దవూర మండలంలో 1,200, గుర్రంపోడు మండలంలో వెయ్యి, నిడమనూరులో మండలంలో వెయ్యి, త్రిపురారం మండలంలో 1,200 కేసులు నమోదయ్యాయి. మాడ్గులపల్లి మండలం ధర్మాపురం గ్రామంలోనూ 250 మందికి కరోనా సోకింది. నియోజకవర్గం పరిధిలో 100 మందికి పైగా కరోనాతో చనిపోయారు. 
టెస్టుల్లేవు.. వ్యాక్సిన్​ లేదు 
నియోజకవర్గంలో ఆసుపత్రులకు వస్తున్నవారికి టెస్టులు చేయడం లేదు. కిట్లు లేక వెనక్కి పంపుతున్నారు. వ్యాక్సిన్​కోసం నాగార్జునసాగర్​లోని కమలానెహ్రూ దవాఖాన సహా ఆయా మండలాల్లోని పీహెచ్​సీల వద్ద జనం క్యూ కడుతున్నారు. రెండో డోస్​ కోసం వెళ్లినవాళ్లకు ‘నో వ్యాక్సిన్’​ అనే సమాధానమే వినిపిస్తోంది. నియోజకవర్గంలోని ప్రజలంతా ‘ఈ బై ఎలక్షన్​ ఎందుకు వచ్చిందా? అని మదన పడుతున్నారు.
స్వచ్ఛంద లాక్​డౌన్​
హాలియా, సాగర్​ మున్సిపాలిటీలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో ఉన్న వ్యాపారవర్గాలు సెల్ఫ్​లాక్​డౌన్​ పాటిస్తున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట కల్లా దుకాణాలను మూసేస్తున్నారు. ఒక వేళ ఎవరైనా లాక్​డౌన్​రూల్స్​ఉల్లంఘిస్తే 3 వేలు జరిమానా విధిస్తున్నారు. ఇంత చేస్తున్నా కరోనా కంట్రోల్​లోకి రావడం లేదు. ప్రజలు కళ్లు తెరిచేలోపే ప్రమాదం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.