
నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు సాగు నీటి విడుదలను డ్యామ్ అధికారులు నిలిపివేశారు. లెఫ్ట్ కెనాల్కు సాగు నీటి అవసరాలు తీరడంతో నీటిని నిలిపివేసినట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఏపీ రైట్ కెనాల్కు మాత్రం సాగు నీరు కొనసాగుతుండటం గమనార్హం. రైట్ కెనాల్పై కృష్ణా రివర్ బోర్డు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో నీటిని నిలిపి వేయలేదని అధికారులు తెలిపారు.
గతేడాది డిసెంబర్ నుంచి రెండు ( రైట్ & లెఫ్ట్ ) కెనాల్స్కు యాసంగి పంటకు అధికారులు నీటిని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. లెఫ్ట్ కెనాల్ సాగు నీటి కోసం రబీ సీజన్లో సుమారు 120 రోజులు 74 టీఎంసీల సాగు నీరు విడుదల చేశారు. మొదటి పంటకు 70 టీఎంసీలు, ఖరీఫ్,రబీ రెండు పంటలకు కలిపి 144 టీఎంసీల నీటిని నాగార్జున సాగర్ డ్యామ్ అధికారులు విడుదల చేయడం గమనార్హం.
Also Read : హెచ్సీయూలో రోడ్డు వేసినప్పుడు ఎక్కడికి పోయారు బావ,బావమరిది
తెలంగాణ, ఏపీలో కలిపి సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు సాగు విస్తీర్ణం 1 0.37 లక్షల ఎకరాలు. దీంట్లో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో 6.62 లక్షల ఎకరాల పారకం ఉంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కలిపి మరో 3.75 లక్షల ఎకరాలు సాగవుతోంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ పొడవు 296 కి.మీ. నాగార్జున సాగర్ కుడి కాలువ పొడవు 203 కి.మీ. నాగార్జున సాగర్ ఎడమ కాలువ వల్ల నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలు లబ్ధి పొందుతున్నాయి.