నిండుకుండలా నాగార్జున సాగర్..

నల్గొండ :  నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో ఉదయం 10 గేట్లు ఎత్తిన అధికారులు ఇన్ ఫ్లో భారీగా పెరగడంతో మధ్యాహ్నానికి మరో 10 గేట్లు.. తర్వాత కొద్దిసేపటికే ఇంకో 6 గేట్లు ఎత్తారు. మొత్తం 26 గేట్ల ద్వారా నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ ఇన్ ఫ్లో 4,22,614 క్యూసెక్కులుగాఉంది.  ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 588 అడుగులకు చేరింది. సాగర్‌ గరిష్ట నీటినిల్వ 312.0405 టీఎంసీలు కాగా, ఇప్పుడు 306.1010 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గరిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్లే విడుదల చేస్తున్నారు. 

మరోవైపు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయం పూర్తిగా నిండటం, 3,88,717 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో అధికారులు 10 గేట్లు ఎత్తి 3,79,110 క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుకాగా.. ప్రస్తుతం 884.60 అడుగులు ఉంది.